‘గేట్’ తెరుచుకుంది!

4 Oct, 2013 01:49 IST|Sakshi
సాక్షి, న్యూఢిల్లీ: సందర్శకులు లేక వెలవెలబోయిన ఇండియాగేట్ పరిసరాలు ఇకపై జనకళ సంతరించుకోనున్నాయి. ఢిల్లీవాసులతోపాటు, రాజధాని పర్యటనకు వచ్చే సందర్శకులు ఎంతో ఇష్టపడే ఇండియాగేట్ పరిసరాల్లో గత కొద్ది నెలలుగా నిషేదాజ్ఞలు అమలులో ఉన్న విషయం తెలిసిందే. డిసెంబర్ 16 నిర్భయ ఘటన తర్వాత ఉవ్వెత్తున ఎగసిన  ఉద్యమం, ఇండియాగేట్ పరిసరాల్లో చెలరేగిన ఆందోళనలతో పోలీసులు ఈ ప్రాంతంలో అనేక ఆంక్షలు అమలులోకి తెచ్చారు. సందర్శకులకు అనుమతి నిరాకరిస్తూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో దాదాపు పది నెలలుగా ఈ పరిసరాల్లో సందర్శకుల సందడి పూర్తిగా తగ్గిపోయింది. 
 
 శాంతిభద్రతల పరిస్థితి కాస్త మెరుగుపడడంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు అనుమతిస్తూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ బస్సీ ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన సమయంలో బందోబస్తు పూర్తి స్థాయిలో ఉండనుంది. పరిస్థితి మరింత మెరుగైతే కొన్ని రోజుల తర్వాత సాయంత్ర వేళల్లో కూడా సందర్శకులను అనుమతించాలని అధికారులు భావిస్తున్న ట్లు సమాచారం. ఢిల్లీపోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ ఆదేశానుసారంగా సందర్శకులను అనుమతిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఢి ల్లీవాసుల పిక్నిక్ స్పాట్ అయిన ఇండియాగేట్ పరిసరాల్లో తిరిగేందుకు అనుమతి లభించడంపై పలువురు రాజధాని వాసులు సంతోషం వ్యక్తం చేశారు.
 
 అమర జవాన్ జ్యోతి వరకే...
 మునుపటిలా ఇండియాగేట్ పరిసరాల్లో సందర్శకులు స్వేచ్చగా తిరిగేందుకు అవకాశం లేదు. కేవ లం అమర జవాన్ జ్యోతి వరకు మాత్రమే సందర్శకులను అనుమతిస్తారు. అక్కడే ఫొటోలు తీసుకోవచ్చు. అక్కడ కూర్చోవడానికి కూడా అనుమతి లేదు. ఇండియాగేట్ పరిసరాల్లోని పార్కుల్లో కూర్చునేందుకూ వీలులేదు. ఇండియాగేట్ నాలుగు వైపులా వీధి వ్యాపారులను అనుమతించరు. ఐస్‌క్రీమ్, గోల్‌గప్పా, చాట్, పాప్‌కార్న్ ఇలా ఏది కొనుక్కోవాలన్నా సదరు పరిసరాల్లోనుంచి బయటకు రావాల్సిందేనని పోలీసులు తెలిపారు. ఎవరైనా ఏదైనా తినాలనుకుంటే రోడ్డుదాటుకుని ముందుకు రావాల్సి ఉంటుంది. దీంతోపాటు షాజహాన్ రోడ్డు, కస్తూర్బా గాంధీ రోడ్డు వైపు ఉన్న పార్కింగ్‌ను కూడా తెరిచారు. ఇక్కడే టూరిస్టు బస్సులు పార్క్ చేసుకునే వీలుంటుంది.
 
 వీధి వ్యాపారులకు తప్పని కష్టాలు...
 ఇండిగేట్ పరిసరాల్లో సందర్శకుల అవసరాలు తీరుస్తూ పొట్టనింపుకునే ఎందరో వీధి వ్యాపారులు గత పది నెలలుగా ఉపాధి కోల్పోయారు. ఇండియాగేట్ పరిసరాల్లో నిషేదాజ్ఞలు అమలులోకి రావడంతో సందర్శకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో వచ్చి గంటల తరబడి గడిపేవారంతా పూర్తిగా మానేశారు. దీంతో ఐస్‌క్రీమ్‌లు, స్నాక్స్, కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిల్స్, చిన్నచిన్న బొమ్మలు, బెలూన్లు విక్రయించే వ్యాపారులు తమ ఉపాధిని కోల్పోయారు. ఒక్కొక్కరు రోజుకు రూ.500 వరకు సంపాదించేవారు. పోలీసు ఆజ్ఞలతో వీరి రోజువారీ సంపాదనపై ఎంతో ప్రభావం పడింది. పది నెలల తర్వాత నిషేదాజ్ఞలను సడలించినప్పటికీ చిరు వ్యాపారులను అనుమతించడం లేదు. భద్రతా కారణాల వల్ల ఇండి యాగేట్ పరిసరాల్లో చిరువ్యాపారులపై నిషేధం కొనసాగుతుందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో వారు పరిసరాల అవతలే వ్యాపారం చేసుకోక తప్పడం లేదు. పరిస్థితి మెరుగుపడితే నిబంధలను మరింత సడలిస్తామని పోలీసులు చెబుతున్నారు.
 
మరిన్ని వార్తలు