దసరా ఉత్సవాల్లో దీక్షతో పని చేయండి

30 Sep, 2016 08:16 IST|Sakshi
దసరా ఉత్సవాల్లో దీక్షతో పని చేయండి

పోలీసు సిబ్బందికి సీపీ గౌతం సవాంగ్ నిర్దేశం
ఇంద్రకీలాద్రిపై భారీ బందోబస్తు  
ఇతర జిల్లాల నుంచి 3,750 మంది సిబ్బంది రాక
 
విజయవాడ: వచ్చే నెల 1వ తేదీ నుంచి 11వరకు ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాల బందోబస్తులో దీక్షతో, సేవాభావంతో  పని చేయాలని నగర పోలీసు కమిషనర్  డి. గౌతం సవాంగ్ సిబ్బందికి ఉద్బోధించారు. గురువారం స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బందోబస్తుకు నియమితులైన పోలీసులతో సమావేశమయ్యారు.

సీపీ మాట్లాడుతూ ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు, భవానీలు తరలివస్తారని, ఎలాంటి అవాంఛనీయాలు, ప్రమాదాలు జరగకుండా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. విధి నిర్వహణలో పాల్గొనే అధికారులు. సిబ్బంది క్రమ శిక్షణతో ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. సిటీ సిబ్బందితో పాటు ఇతర జిల్లాల నుంచి సుమారు 3,750 మంది పోలీసులు వస్తున్నారని తెలిపారు.
 
కమిషనర్ జారీ చేసిన సూచనలు ఇలా...
కృష్ణాపుష్కరాల్లో మాదిరిగానే పేరు తెచ్చేలా దసరా ఉత్సవాలలో కూడా అదే స్ఫూర్తితో  పనిచేయాలి.  
ప్రతీ ఒక్కరు ఆయా ప్రదేశాల్లో తమకు నిర్ధేశించిన షిప్టులలో బాధ్యతాయుతంగా, అవగాహనతో వ్యవహరించాలి.  
బందోబస్తులో పాల్గొనే అందరి ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచుతూ అన్ని అంశాలు కంప్యూటరైజ్ చేయడం జరిగిందన్నారు.
ఆయా సెక్టార్లకు సంబందించిన అధికారులు, అందరు సిబ్బంది విధులకు గైర్హాజరు కాకుండా పర్యవేక్షించాలి.
పోలీసు శాఖ అంటే ప్రజలకు సేవ చేసే వ్యవస్థగా ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకునేలామెలగాలి.  
భక్తులతో మర్యాదపూర్వకంగా, మృదువుగా మాట్లాడాలి.
ఎప్పటికప్పుడు క్రమపద్దతిలో భక్తులను అనుమతించాలి.
ఈ కార్యక్రమంలో జేసీపీ పి.హరికుమార్, డీసీపీలు పాల్‌రాజు, కోయ ప్రవీణ్, జి.వి.జి. అశోక్ కుమార్, కాంతి రాణాటాటా పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు