-

సార్వత్రిక బంద్

3 Sep, 2015 02:16 IST|Sakshi
సార్వత్రిక బంద్

రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తం
బుధవారం సాయంత్రం నుంచి
బెంగళూరులో బస్‌ల సంచారం

 
బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతి రేక విధానాలకు నిరసనగా కార్మిక సంఘాలు దేశ వ్యాప్తంగా పిలుపునిచ్చిన బంద్ రాష్ట్రంలో విజయవంతమైంది. బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రాష్ట్ర రాజధాని బెంగళూరుతో పాటు రాచనగరి మైసూరు, దావణగెరె, శివమొగ్గ, కోలారు, మండ్య, గుల్బర్గా,  మంగళూరు తదితర ప్రాంతాలన్నింటిలో రవాణా పూర్తిగా స్తంభించిపోయింది. బంద్ నేపథ్యంలో బీఎంటీసీ, కేఎస్‌ఆర్‌టీసీ బస్‌లు పూర్తిగా బస్టాండ్‌లకే పరిమితమయ్యాయి. బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు సైతం ముందు జాగ్రత్తగా పాఠశాలలకు సెలవు ప్రకటించడంతో విద్యాలయాలన్నీ స్తబ్దుగా మారాయి. ఇక ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించని నేపథ్యంలో ఉద్యోగులు ఉదయాన్నే తమ విధుల కోసం బయలుదేరారు. బుధవారం ఉదయం కొన్ని బస్‌లు రోడ్‌లపైకి వచ్చినప్పటికీ ఆందోళన కారులు బస్‌లపై దాడులకు దిగడంతో అధికారుల బస్‌ల సంచారాన్ని నిలిపేశారు. ఇక ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన వారు బస్‌ల సంచారం నిలిచిపోవడంతో బస్టాండ్‌లలోనే కాలాన్ని వెళ్లదీయాల్సి వచ్చింది.

బుధవారం ఉదయం నుంచి అక్కడక్కడా కొన్ని ఆటోలు నగర రోడ్లపై కనిపించినా, సాధారణ చార్జీ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఆటో చార్జీలు వసూలు చేయడంతో సామాన్యుడు ఉసూరుమనాల్సిన పరిస్థితి ఎదురైంది. కాగా, మెట్రో రైలు మాత్రం సాధారణంగానే నడిచింది. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది నగర వాసులు మెట్రో రైలులో ప్రయాణానికి ప్రాధాన్యత ఇచ్చారు. కాగా, బుధవారం సాయంత్రానికి తిరిగి బస్‌ల సంచారం ప్రారంభమైంది. ఇక బంద్ ప్రభావం ఉన్నప్పటికీ నగరంలోని సినిమా థియేటర్‌లు, హోటళ్లు, పెట్రోల్ బంక్‌లు సాధారణంగానే పనిచేశాయి.
 

మరిన్ని వార్తలు