‘జీనోమిక్స్’తో కేన్సర్ నిర్ధారణ ఉత్తమం

9 May, 2014 01:48 IST|Sakshi
  • హెచ్‌సీజీ వైద్య సంస్థల చైర్మన్ అజయ్‌కుమార్
  •  సాక్షి, బెంగళూరు : కేన్సర్ నిర్ధారణలో సంప్రదాయ పద్ధతి కన్నా జీనోమిక్స్ ఆధారిత విధానం ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుందని హెచ్‌సీజీ వైద్య సంస్థల చైర్మన్ బి.ఎస్.అజయ్‌కుమార్ తెలిపారు. కేన్సర్ రోగ నిర్ధారణ పరిశోధనల పరంగా ప్రముఖ లాబోరేటరీ స్టాండర్డ్ లైఫ్ సైన్స్, హెచ్‌సీజీ సంస్థల మధ్య గురువారం ఒప్పందం కుదిరింది.

    ఈ సందర్భంగా స్టాండర్డ్ లైఫ్ సైన్స్ చైర్మన్ విజయ్ చంద్రుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సంప్రదాయ రోగ నిర్ధారణలో కేన్సర్ ఉందా లేదా, ఉంటే ఏ స్టేజ్‌లో ఉంది అనే విషయాన్ని గుర్తించేందుకు వీలవుతుందని అన్నారు. అయితే జీనోమిక్స్ ఆధారిత రోగ నిర్ధారణలో రోగికి ఏ స్థితిలో కేన్సర్ కారకం ఉందనే విషయంతో పాటు కుటుంబసభ్యులో ఎవరికైనా ఇదే విధమైన కేన్సర్ వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని కూడా గుర్తించవచ్చునని వివరించారు.

    కేన్సర్ కణం పరిమాణంతో పాటు ఎంత వేగంగా ఏ దిశలో విస్తరిస్తోందో కచ్చితంగా తెలుసుకునే అవకాశం కూడా ఉందన్నారు. దీని వల్ల రోగికి చికిత్స ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. దేశంలో తొలిసారిగా బెంగళూరులోని హెచ్‌సీజీ కేంద్ర కార్యాలయంలో ఈ విధానం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 60 మందికి జీనోమిక్స్ విధానంలో రోగ నిర్ధారణ చేసినట్లు చెప్పారు.

    ఈ విధానానికి రెండు వారాల సమయం పడుతుందని, ఉత్తమ ఫలితాలు ఉన్నాయని పేర్కొన్నారు. రోగితో పాటు సంబంధీకులు ఎంతమందికి పరీక్షలు చేయాలనే విషయం కేన్సర్ రకం, స్టేజ్‌పై ఆధాపడి ఉంటుందని అన్నారు. కాగా, ప్రస్తుతం బ్రెస్ట్, ఓవరీ, లంగ్ కేన్సర్‌లకు జీనోమిక్ ఆధారిత రోగనిర్ధారిత పరీక్షలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని రకాల కేన్సర్ పరీక్షలకు వీటిని ఉపయోగిస్తామని అజయ్‌కుమార్ వివరించారు.
     

>
మరిన్ని వార్తలు