త్రిపాఠి అవుట్.. జార్జ్ ఇన్!

21 May, 2014 23:21 IST|Sakshi

 లోక్ సభ ఎన్నికల కోసం నియమించిన చెన్నై పోలీసు కమిషనర్ త్రిపాఠి బుధవారం తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో కమిషనర్‌గా జార్జ్ మళ్లీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర రాజధాని నగరంలో భద్రత పటిష్టం, అనుక్షణం నిఘా లక్ష్యంగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దించనున్నట్టు జార్జ్ ప్రకటించారు.
 
 సాక్షి, చెన్నై:లోక్‌సభ ఎన్నికల వేళ ఈసీ కొరడా ఝుళిపించిన విషయం తెలిసిందే. అధికారుల బదిలీలు ఓ వైపు సాగితే, మరో వైపు అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులను ఆగమేఘాలపై మరోచోటకు ఎన్నికల కమిషన్ మార్చింది. ఆ దిశగా చెన్నై పోలీసు కమిషనర్‌గా వ్యవహరించిన జార్జ్‌పై ఆరోపణలు వచ్చారుు. అధికార పక్షానికి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తున్నారంటూ డీఎంకే ఫిర్యాదులు మోత మోగించింది. దీంతో జార్‌‌జను తప్పించాల్సి వచ్చింది. ఆయన్ను కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో జైళ్ల శాఖ అదనపు డీజీపీ త్రిపాఠిని రంగంలోకి దించారు. జార్జ్‌ను జైళ్ల శాఖకు పంపించారు. నెల రోజులకు పైగా త్రిపాఠి చెన్నై పోలీసు కమిషనర్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల నిబంధనలను ఈసీ సడలించింది. దీంతో ఎన్నికల వేళ బదిలీల వేటు, ఆగమేఘాలపై మార్పులకు గురైన అధికారులు మళ్లీ తమ తమ స్థానాల్లోకి వచ్చే పనిలో నిమగ్నమయ్యారు. బాధ్యతల స్వీకరణ: ఎన్నికల పోలీసు కమిషనర్‌గా వ్యవహరించిన త్రిపాఠి ఉదయం తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో కమిషనర్ పగ్గాలను జార్జ్‌కు అప్పగించారు. పూందమల్లి హైరోడ్డులోని కమిషనరేట్‌లో ఉదయం జార్జ్ బాధ్యతలు స్వీకరించారు. ఇరువురు కరచాలనం చేసుకున్నారు. త్రిపాఠికి వీడ్కోలు పలికారు. కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన జార్జ్‌కు అదనపు, డెప్యూటీ, అసిస్టెంట్ కమిషనర్లు శుభాకాంక్షలు తెలియజేశారు.
 
 ప్రత్యేక బృందాలు: రాజధాని నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నామని జార్జ్ పేర్కొన్నారు. మీడియా తమ వంతుగా అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. కొన్ని కేసుల ఛేదింపుల్లో మీడియా సహకారం ఆమోఘం అని, ఇది మరింతగా విస్తృతం కావాలని కోరారు. నేరాల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటూ వస్తున్నా, కొత్త రకాలు పుట్టుకొస్తున్నాయని వివరించారు. సినీ ఫక్కీలో సాగుతోన్న నేరాలను కట్టడి చేయడం లక్ష్యంగా నిఘాను మరింత పటిష్ట వంతం చేయబోతున్నామన్నారు. జన సంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు రంగంలోకి దించబోతున్నామని పేర్కొన్నారు. నగరంలోని ఆయా పోలీసు డివిజన్లలోని అసిస్టెంట్ కమిషనర్ల నేతృత్వంలో ఈ బృందాలు ఏర్పాటు చేయనున్నాట్లు వివరించారు. జన సంచారం అత్యధికంగా ఉండే ప్రాంతాలను, సంఘవిద్రోహ శక్తులు, నేరగాళ్ల కదలికలను ఈ బృందాలు ఎప్పటికప్పుడు పసిగడుతూ వస్తాయని చెప్పారు. అలాగే, రైల్వే స్టేషన్లలో సమష్టి భద్రతకు చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. ఆర్‌పీఎఫ్‌తో సంప్రదింపులు జరపనున్నామని, సమీక్షల అనంతరం రైల్వే స్టేషన్లలో నిఘా కట్టుదిట్టానికి సమష్టిగా నిర్ణయాలు తీసుకోనున్నామన్నారు. కొన్ని చోట్ల చాప కింద నీరులా సాగుతున్న రౌడీల వ్యవహారాలు పసిగట్టి, వారి భరతం పడతామని హెచ్చరించారు. నేరాలకు పాల్పడుతున్న వాళ్లు బెయిల్ మీద బయటకు వచ్చేందుకు వీల్లేని రీతిలో నాన్ బెయిల్ కేసు గూండా చట్టంను అత్యధికంగా ప్రయోగించనున్నట్లు చెప్పారు. ఇక, గూండా చట్టాల మోత తప్పదని, తస్మాత్ జాగ్రత్త అంటూ నేరగాళ్లకు, అజ్ఞాతంలో ఉన్న రౌడీలకు ఆయన హెచ్చరికలు జారీ చేశారు.  
 

మరిన్ని వార్తలు