డెంగీతో చిన్నారి మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన

27 Sep, 2016 17:31 IST|Sakshi

నల్లకుంట: డెంగీ జ్వరంతో బాధపడుతున్న చిన్నారి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.  తమ పాప మృతికి వైద్యులే కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఘటన నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం జరిగింది. ఆస్పత్రి వర్గాలు, బాధితుల కథనం ప్రకారం... బాగ్‌అంబర్‌పేట బతుకమ్మకుంటకు చెందిన ఎం.అశోక్, కోటమ్మ దంపతులు తమ కుమార్తె పవిత్ర (ఏడాదిన్నర)కు తీవ్రమైన జ్వరం రావటంతో ఈ నెల 24న విద్యానగర్ ఓయూ రోడ్డులో గల ఓ ప్రైవేట్ చిల్డ్రన్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు.

చిన్నారిని పరీక్షించిన అక్కడి వైద్యులు డెంగీ జ్వరంగా నిర్ధారించి ఇన్‌పేషంట్‌గా చేర్చుకుని చికిత్స చేశారు. చిన్నారి ఆరోగ్యం కుదుటపడక పోవడంతో వైద్యులు ఎల్లో బ్లడ్ ఎక్కించాలని తల్లిదండ్రులకు చెప్పారు. అందుకు వారు అంగీకరించటంతో సోమవారం సాయంత్రం చిన్నారికి రక్తం ఎక్కించారు. రాత్రి నుంచి చిన్నారికి శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో మంగళవారం తెల్లవారు జామున మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే చిన్నారి చనిపోయిందంటూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. చివరికి ఆస్పత్రి యాజమాన్యంతో రాజీ కుదరటంతో చిన్నారి మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు