కళ్లు తెరవకనే..

6 May, 2015 06:25 IST|Sakshi

మా అమ్మ ఒడిలో వెచ్చగా నిదురించే సమయంలో నాన్న పొలం నుంచి వచ్చాడు. అమ్మ చేతుల్లోంచి నాన్న నన్ను ఎత్తుకోగానే నన్ను తన భుజాలపై వేసుకొని ఆడిస్తాడని సంబర పడ్డాను. కానీ నాన్న అలా చేయలేదు. పొలంలో చల్లాల్సిన పురుగుల మందును కాస్తా నాకు పట్టించేశాడు. ఎందుకో తెలుసా నేను ఆడపిల్లననే కారణంతో. వద్దు నాన్నా నన్ను చంపాలని చూడకు, నాకు కూడా అందరిలా ఈ లోకాన్ని చూడాలని ఉంది, నీ వేలు పట్టుకొని నడవాలని ఉంది, అని చెబుదామనుకున్నాను, కానీ నాకేమో మాటలు రావు, నా గుండె ఘోష నాన్నకు అర్ధం కాదు బెంగళూరులోని వాణివిలాస్ ఆస్పత్రిలో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న ఓ చిన్నారి మనసులోని వ్యధ ఇది.

అవును కేవలం నెల రోజుల వయసు కలిగిన చిన్నారిని ఆడపిల్లనే కారణంతో వద్దనుకున్నాడు ఓ కర్కశ తండ్రి. ఆడపిల్లంటే అంతా మైనస్సే అన్న భావనతో చెన్నపట్నకు చెందిన శివకుమార్ నెలరోజుల వయస్సున్న తన కూతురికి మే 1న రాత్రి సమయంలో పురుగుల మందు పట్టించాడు. దీంతో పాప ఆరోగ్యం విషమించడంతో పాప తల్లి వీణా చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లింది. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని వాణి విలాస్ ఆస్పత్రికి పాపను తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఐసీయూలో మృత్యువుతో పోరాడుతోంది.
 
 
 సాక్షి, బెంగళూరు:
ఎంతో మంది ఆడపిల్లలు భూమి మీద పడకుండానే తల్లి గర్భంలో ఉండగానే ప్రాణాలు వదులుతుంటే మరికొందరేమో కర్కశ మనస్తత్వం కలిగిన తండ్రుల చేతుల్లో కళ్లు కూడా తెరవకుండానే కడతేరుతున్నారు. ఆడపిల్లా అయితే అవసరం లేదు అనుకుంటున్న వారి కారణంగా ఇలా భ్రూణ హత్యల్లో కన్నుమూస్తూ, చెత్తకుప్పల్లోకి చేరి కుక్కలకు, పందులకు ఆహారంగా మారుతున్న చిట్టి తల్లులు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి చర్యల వల్ల రాష్ట్రం లో అమ్మాయిల సంఖ్య తగ్గిపోతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో సగటున ప్రతి వెయ్యిమంది మగపిల్లలకు 943 మంది మాత్రమే ఆడపిల్లలు (సెక్స్ రేషియో) ఉన్నారు. కాగా కొన్ని జిల్లాల్లో ఈ పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. రాష్ట్రంలోని దాదాపు 15 జిల్లాల్లో ఈ సెక్స్ రేషియో రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉండటం అందోళన కలిగించే అశం.

రాష్ట్రానికి తీవ్ర నష్టం
భారత దేశంలో ప్రతి రోజూ సగటున ఏడు వేల మంది బా లికలు గర్భంలోనే లేదా పుట్టిన ఐదేళ్లలోపు తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారని ఐక్యరాజ్యసమితి బాలల నిధి (యునెసెఫ్) తాజా నివేదికలో వెల్లడించింది. వంశాన్ని ఉద్దరించే మగపిల్లలుంటే చాలు ఆడపిల్లలు అవసరం లేదన్న మూఢ నమ్మకంతో ఈ పరిస్థితి తలెత్తుతోందని యునెసెఫ్ తన నివేదికలో పేర్కొంది. దేశంలోని అనేక రాష్ట్రాలు ఈ విషయంలో పోటీపడుతూ ఆడబిడ్డలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఇందుకు కర్ణాటక కూడా మినహాయింపు కాదని తన నివేదికలో ఘాటుగా విమర్శించింది.

చట్టాలు ఉన్నా అమలేది
ఆడశిశువుల హత్యలతో భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఉత్తరభారత దేశంలోని అనేక రాష్ట్రాల్లో పెళ్లిళ్లు చేసుకునేందుకు అబ్బాయిలకు అమ్మాయిలు దొరకని పరిస్థితి ఏర్పడింది. దాంతో వారు వరకట్నానికి బదులుగా కన్యాశుల్కం ఇస్తామన్నా కూడా పెళ్లిల్లు జరగడం లేదు. దీంతో అక్కడి అబ్బాయిలు అవివాహితులుగానే ఉండి పోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయడానికి, ఆడ శిశువులను సంరక్షించడానికి కేంద్ర ప్రభుత్వం భ్రూణ హత్యల నిరోధక చట్టాన్ని 1996లో దేశ వ్యాప్తంగా అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి కర్ణాటకలో కూడా ఈ చట్టం అమల్లో ఉన్నా ఇప్పటి వరకూ ఈ చట్టం కింద శిక్షలు పడిన దాఖలాలు ఒక్కటి కూడా లేదు. దీంతో ఈ చట్టం రాష్ట్రంలో ఏపాటిగా అమలవుతోంది అర్థమవుతోంది. ఇక రాష్ట్రంలోని  లింగనిర్థారణ పరీక్షలు  జరిపే సంస్థల పై ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ (ప్రొహిబిటెడ్) యాక్ట్ ప్రకారం నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని....  నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన సంస్థల లెసైన్సులు రద్దుపరిచి బాధ్యులకు తప్పక శిక్ష పడేలా చేసినప్పుడు మాత్రమే భ్రూణ హత్యలు తగ్గుతాయని న్యాయనిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు