విద్యుత్ ఇవ్వండి

28 Aug, 2015 02:32 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి  డి.కె.శివకుమార్ వినతి
 రోజుకు 1,500  మెగా   వాట్‌ల విద్యుత్ అవసరమని వివరణ

 
లోడ్‌షెడ్డింగ్ సమస్య పరిష్కారానికి గాను రోజుకు 1,500 మెగావాట్‌ల విద్యుత్‌ను అందజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత నెలకొన్న నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేయాల్సిందిగా కేంద్ర ఇంధనశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ కోరారు. రాష్ట్రంలో విద్యుత్ రంగంలో నెలకొన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు, బొగ్గు సరఫరా తదితర అంశాలపై చర్చించేందుకు గాను గురువారమిక్కడి విధానసౌధలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి డి.కె.శివకుమార్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను పీయూష్‌గోయల్ దృష్టికి డి.కె.శివకుమార్ తీసుకువచ్చారు. లోడ్‌షెడ్డింగ్‌ను నివారించేందుకు గాను రోజుకు 1,500 మెగావాట్‌ల అదనపు విద్యుత్‌ను కేంద్ర గ్రిడ్‌నుంచి అందజేయాల్సిందిగా కోరారు. ఇదే సందర్భంలో విద్యుత్ ఉత్పాదనలో స్వావలంభన సాధించేందుకు ప్రయత్నిస్తున్న కర్ణాటకకు బొగ్గు సరఫరా సైతం పెంచాలని కేంద్రానికి విన్నవించారు.

ఇక విద్యుత్ సరఫరా కోసం కొత్తలైన్‌లను ఏర్పాటు చేసే క్రమంలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యలను పరిష్కరించేందుకు గాను జాతీయ స్థాయిలో  కొత్త విధివిధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించారు. రానున్న నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు 24గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేసే దిశగా చేపడుతున్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు గాను రాష్ట్రానికి రూ.3,500కోట్లను కేటాయించాలని, సౌర విద్యుత్ పార్క్‌ల ఏర్పాటుకు రాయితీలను మరింత పెంచాలని కోరారు. వీటన్నింటిని సావధానంగా విన్న కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
 
 
 

>
మరిన్ని వార్తలు