తనిఖీల విషయంలో చూసి చూడనట్టుగా..

13 Apr, 2017 18:15 IST|Sakshi
తనిఖీల విషయంలో చూసి చూడనట్టుగా..
బెంగళూరు: విదేశాల నుంచి బంగారం బెంగళూరు మీదుగా వివిధ ప్రాంతాలకు తరులుతోంది. వివిధ దేశాల నుంచి నేరుగా బెంగళూరుకు విమానాలు అందుబాటులో ఉండటంతో పాటు ఇక్కడ తనిఖీల విషయంలో కొంత చూసి... చూడనట్లు వ్యవహరిస్తుండటమే ఇందుకు కారణమని సమాచారం. మూడు రోజుల ముందు అక్రమ మార్గంలో తరలించడానికి సిద్ధంగా ఉన్న 12 కిలోల బంగారు బిస్కెట్లు బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు గుర్తించడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇలాంటివి అడపా దడపా గుర్తించినా అధికారుల కన్నుగప్పి వందల కిలోల బంగారం భారత దేశంలోకి దిగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది.

బ్యాంకాక్‌ నుండి థాయ్‌ ఎయిర్‌ ఎయిర్‌ ఏషియా విమానంలో వచ్చిన ఓ వ్యక్తి అక్రమంగా బంగారు, వజ్రాభరణాలను ఎయిర్‌పోర్టులోని శౌచాలయంలో దాచినట్లు కస్టమ్స్‌ అధికారులకు సమాచారమందింది. దీంతో విమానాశ్రయంలోని శౌచాలయంలో తనిఖీలు నిర్వహించిన అధికారులకు శౌచాలయంలో పిల్లల డైపర్‌డిస్పెన్సరీని స్వాధీనం చేసుకున్నారు. ఈ యంత్రాన్ని స్కానర్ల సహాయంతో స్కానింగ్‌ చేయగా అందులో కార్బన్, ప్లాస్టిక్‌ కవర్లలో చుట్టిన ప్యాకెట్లను గుర్తించారు. డిస్పెన్సరీని తెరచి చూడగా అందులో బంగారు బిస్కెట్లు, ఇతర బంగారు, వజ్రాభరణాల లభించాయి.

యంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఆచూకీ కోసం ఎయిర్‌పోర్టులోని సీసీకెమెరా ఫుటేజ్‌లను పరిశీలించిన అధికారులు డిస్పెన్సరీ యంత్రంతో శౌచాలయంలోకి వెళుతున్న వ్యక్తిని గమనించిన అధికారులు ఎయిర్‌పోర్టును సిబ్బందిని అప్రమత్తం చేసారు. ఎయిర్‌పోర్టు నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌ అధికారులు వ్యక్తిని తమిళనాడుకు చెందిన మహమద్‌ మోహిద్దిన్‌గా గుర్తించారు. తమిళనాడులో చిన్న పిల్లల ఆట వస్తువులు విక్రయించే వ్యాపారాన్ని నిర్వహించే మహమద్‌ మోహిద్దిన్‌ డబ్బులకు ఆశపడే బంగారు ఆభరణాలను అక్రమంగా తరలించాడినికి అంగీకరించినట్లు తమ విచారణలో తెలిసిందని అధికారులు తెలిపారు.

అయితే బంగారు ఆభరణాల అక్రమ రవాణకు ఎయిర్‌పోర్టుకు చెందిన సిబ్బంది కూడా మహమద్‌ మోహిద్దిన్‌కు సహకరించినట్లు సంబంధిత అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంగారు బిస్కెట్లు విదేశాల నుంచి అక్రమంగా బంగారు, వజ్రాభరణాలను తరలిస్తున్న ఓ వ్యక్తిని బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్‌ విభాగానికి చెందిన ఎయిర్‌ ఇంటలిజెన్స్‌ యూనిట్‌ (ఏఐయూ)అధికారులు అరెస్ట్‌ చేసారు. ఈ ఘటనలో రూ.2.60కోట్ల విలువ చేసే 6.65కేజీల బంగారు, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
 
మరో ఘటనలో...
 
ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న ఎయిర్‌ ఇండియాకు చెందిన వీమానంలోని శౌచాలయంలో దాదాపు 6 కిలోల బరువున్న 12 బంగారు బిస్కెట్లను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.1.5 కోట్లు. ఈ విషయమై ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని సమాచారం.
మరిన్ని వార్తలు