గోల్డెన్ ఆఫర్

25 Dec, 2014 02:20 IST|Sakshi
గోల్డెన్ ఆఫర్

టైర్ 2, 3 నగరాల్లో కంపెనీల స్థాపనకు ముందుకు వస్తే ఉచితంగా భూమి
పెట్టుబడుల సేకరణకు త్వరలో  సిద్ధు అమెరికా పర్యటన
ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ప్రాంతాల్లో ఉచిత ‘వై-ఫై’
వెల్లడించిన మంత్రి ఎస్‌ఆర్ పాటిల్

 
బెంగళూరు :  రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో (టైర్-2,3 సిటీల్లో)  ఐటీ కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు 30 ఏళ్ల పాటు ఉచితంగా భూమిని లీజుకు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఐటీ,బీటీ శాఖ మంత్రి ఎస్.ఆర్ పాటిల్ తెలిపారు. బెంగళూరులో మీడియాతో ఆయన బుధవారం మాట్లాడారు. ఐటీ కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి పన్ను రాయితీ కూడా ఎక్కువగానే ఉంటుందని ప్రకటించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పారిశ్రామిక వేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. సమాచార సాంకేతిక రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి వీలుగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య త్వరలో అమెరికా పర్యటన చేపట్టనున్నారని చెప్పారు.

ఆయన వెంట తనతో పాటు ఇక్కడి ఐటీ ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా వెళుతున్నట్లు పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన అమెరికాకు తీసిపోని రీతిలో కర్ణాటకను తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఇక్కడి వనరులను అమెరికాలోని పెట్టుబడిదారులకు వివరించేందుకు గాను ఈ పర్యటన చేపట్టినట్లు వివరించారు. ఐటీ అభివృద్ధి బెంగళూరుకు మాత్రమే పరిమితం కానివ్వబోమన్నారు. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలను రచిస్తున్నట్లు తెలిపారు.  బెంగళూరు పరిధిలో వంద ప్రాంతాలతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో రెండు ప్రాంతాల్లో ఉచిత వై-ఫై సదుపాయాన్ని కల్పించబోతున్నట్లు మంత్రి చెప్పారు.
 

మరిన్ని వార్తలు