ఉద్యోగులకు శుభవార్త

24 Jun, 2018 13:14 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఆరో వేతన సంఘం సిఫార్సు చేసిన 30 శాతం వేతన పెంపు జూలై నుంచి ఉద్యోగుల జీతాల్లో జమ కానుంది. ఏప్రిల్‌ 1 నుంచి పెంపు వర్తిస్తుంది. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఎంఆర్‌ శ్రీనివాసమూర్తి నేతృత్వంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణపై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కమిటీ ఉద్యోగుల మూలవేతనంపై 30 శాతం, డీఏపై 13 శాతం పెంచాలని సిఫార్సు చేసింది. దీనికి అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆమోదం తెలిపారు.

రూ.10,500 కోట్ల భారం
ఇదే విషయమై ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో మాజీ సీఎం సిద్ధరామయ్య వేతనాల పెంపు గురించి ప్రస్తావించారు. ఈ పెంపుతో ప్రభుత్వంపై రూ.10,500 కోట్ల భారం పడుతుందని అప్పట్లో సిద్ధరామయ్య ప్రకటించారు. వేతనాల పెంపుతో రాష్ట్రంలోని 5.02 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు,  ప్రభుత్వ అనుబంధ రంగ సంస్థల్లోని 73 వేల మందికి లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వ ప్రకటనపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వం ప్రకటించిన 43 శాతం వేతనాలు పెంచడం సాధ్యం కాదని, ఆ మేరకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని ఆర్థిక శాఖ తెలిపింది. 
అయితే 30 శాతం మేర జీతాలు పెంచేందుకు ఆర్థిక శాఖ పచ్చజెండా ఊపింది. పెంపునకు ఆరో వేతన సంఘం ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఎన్నికల కారణంగా వాటి అమలు వాయిదా పడింది. మే నెలలో పెంచిన జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోకి జమ చేయాల్సి ఉండగా ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ పెరిగిన జీతాలు మే, జూన్‌ నెలల్లో జమ కాలేదు. ఈ నేపథ్యంలో జూలై జీతంలో జమ అవుతుంది.

సాక్షి, బెంగళూరు..

మరిన్ని వార్తలు