అన్నదాతకు ‘కొత్త’ కానుక

22 Dec, 2013 02:47 IST|Sakshi

 సాక్షి, చెన్నై: రాష్ట్రంలోని చెరకు రైతులకు ప్రభుత్వం నూతన సంవత్సర కానుకను ప్రకటించింది. టన్ను చెరకుకు 2,650 రూపాయల మద్దతు ధరను ప్రకటించింది. రాష్ట్ర సచివాలయంలో శనివారం మంత్రి మండలి సమావేశమైంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, విభాగాల వారీగా ప్రగతి, నిధుల కేటాయింపులు, కలెక్టర్ల మహానాడులో చర్చించి తీసుకున్న నిర్ణయాల మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలు, పథకాలపై చర్చించారు. వ్యవసాయ ఉత్పత్తులు, రాష్ర్టంలో సాగవుతున్న పంటల ఉత్పత్తి తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం చెరకు మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
 టన్నుకు రూ. 2650 : రాష్ర్టంలో 8.65 లక్షల ఎకరాల్లో చెరకు సాగువుతోంది.

చెరకు రైతులకు ప్రతి ఏటా ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తూ వస్తోందని సీఎం జయలలిత గుర్తుచేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, రుణాల పంపిణీ గురించి విశదీకరించారు. చక్కెర ఉత్పత్తి పెంపు లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్రం చెరకు మద్దతు ధర ప్రకటించినప్పుడల్లా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా కొంత మొత్తాన్ని చేరుస్తూ, అన్నదాతకు అందజేస్తోందని గుర్తు చేశారు. ఈ ఏడాది టన్నుకు రూ.2100 కేంద్రం నిర్ణయించగా, రవాణా ఖర్చు రూ.100తో పాటుగా రూ.550ను రాష్ట్ర ప్రభుత్వ వాటాగా పెంచామన్నారు. టన్ను మద్దతు ధర రూ.2650గా నిర్ణయించామన్నారు.      

           2013-14 సంవత్సరానికి మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ప్రకటించినా, రాష్ర్ట వాటాలో చడీచప్పుడు కాకుండా రూ.వంద కోత పెట్టడం గమనార్హం. 2011-12లో కేంద్రం రూ.1450ను ప్రకటించగా, రవాణా ఖర్చు రూ.100తో పాటుగా650ను ప్రభుత్వం ఇచ్చింది. అలాగే, 2012-13కు గాను కేంద్రం రూ.1700 నిర్ణయించగా, రవాణా ఖర్చు రూ.100తోపాటుగా 650ను రాష్ట్ర ప్రభుత్వం అందజేసింది. అయితే, తాజాగా రూ.650, నుంచి రూ.550 కావడం గమనించాల్సిందే.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా