ప్రజల బాధలు పట్టని సర్కార్

28 Oct, 2013 00:57 IST|Sakshi

 సాక్షి, న్యూఢిల్లీ: ఆకాశానంటుతున్న ధరలతో ప్రజలు దోపిడీకి గురవుతుంటే ప్రభుత్వం చేతులుకట్టుకుకూర్చుని చోద్యం చూస్తోందంటూ బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉల్లి ధరలు 200 శాతం పెరిగాయని, ఇందుకు పక్క రాష్ట్రాల్లో ఉత్పత్తి తగ్గడమేనంటూ మీడియాలో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ చేస్తున్న వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని దుయ్యబట్టారు. కూరగాయల ధరలు సైతం నెల రోజుల్లో వందశాతం పెరిగాయని ఇందుకు ఎవరు కారకులో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ సీఎం అభ్యర్థి డాక్టర్ హర్షవర్ధన్, బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్, విధానసభ ప్రతిపక్ష నాయకుడు విజయ్‌కుమార్ మలోత్రా పాల్గొన్నారు.
 
 హర్షవర్ధన్ మాట్లాడుతూ.. ‘ప్రజలకు తక్కువ ధరలకు ఆహార ఉత్పత్తులను అందజేయడం ప్రభుత్వ ప్రాథమిక విధి. ప్రజలు ఎక్కువ చెల్లించాల్సి వస్తోందంటే ఆ ప్రభుత్వం విఫలమైనట్టేన’న్న ఆర్థికవేత్త అమర్త్యసేన్ మాటలను ఉటంకించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిపాయలు కొనుగోలు చేస్తే సరిపోతుందన్న షీలా సర్కార్ ఆలోచన కేవలం తాత్కాలిక ఉపశమనం కలిగిస్తుందని స్పష్టం చేశారు. పెరుగుతున్న ఉల్లి వినియోగానికి తగ్గట్టు దిగుమతులను పెంచడానికి శాశ్వత చర్యలు తీసుకోకపోతే మరోమారు పరిస్థితి పునరావృతం అవుతుందన్నారు. ‘ఒక డాక్టర్‌గా నేను సమస్య రాకుండా పాటించే  ముందు జాగ్రత్తనే నమ్ముతాను. ఇందుకోసం శాశ్వతంగా ఓ కమిటీని వేస్తాం. ఇందులో ఆయా రంగాలకు చెందిన నిపుణులు ఉంటారు. వారు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ, రాబోయే ఆపదను హెచ్చరిస్తారు. వెంటనే అవసరమైన చర్యలు తీసుకునే వీలుంటుంది’ అని పేర్కొన్నారు.
 
 ‘నిత్యావసరాల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని అన్ని జిల్లాల అధ్యక్షులకు సూచించాం. ధరలు తగ్గేదాకా మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం’ అని బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ పేర్కొన్నారు. ధరల పెరుగుదలకు షీలా దీక్షిత్ సర్కార్ వైఫల్యమే కారణమని విజయ్‌కుమార్ మల్హోత్రా ఆరోపించారు.

మరిన్ని వార్తలు