గొంతులు కూడా తడపలేరా?

24 Mar, 2016 02:16 IST|Sakshi
గొంతులు కూడా తడపలేరా?

= గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వ వైఫల్యం
= నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలన్న విపక్షనేత శెట్టర్

బెంగళూరు:  గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కేంద్రాలను మార్చి చివరిలోగా ఏర్పాటు చేస్తామన్న తన హామీని నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విపక్షనేత జగదీష్ శెట్టర్ మండిపడ్డారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి హెచ్.కె.పాటిల్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనసభలో బుధవారం జరిగిన చర్చా కార్యక్రమంలో జగదీష్ శెట్టర్ మాట్లాడారు. ‘గ్రామీణ ప్రాంత వాసుల దాహార్తిని తీర్చేందుకు ఏడు వేల తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, లేదంటే పదవికి రాజీనామా చేస్తానని గత ఏడాది మీరే చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 1,500తాగునీటి కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేయగలిగారు.

మీకే మాత్రం నైతికత ఉన్నా ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయండి’ అంటూ డిమాండ్ చేశారు. ‘ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు, మీకూ మధ్య అభిప్రాయ బేధాలున్నాయో లేక నిధులు విడుదల కాలేదో! అవేవీ మాకు తెలియదు. మాకు కేవలం ఫలితాలే ముఖ్యం’ అని జగదీష్ శెట్టర్ పేర్కొన్నారు. అనంతరం మంత్రి హెచ్.కె.పాటిల్ మాట్లాడుతూ....

 
రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల తాగునీటి కేంద్రాల స్థాపనకు టెండర్లను పిలిచామని, అయితే అధికారుల లోపం, కాంట్రాక్టర్‌ల తప్పుల కారణంగా 4000 కేంద్రాలకు సంబంధించిన టెండర్లను తిరస్కరించామని వివరించారు. ఈ కేంద్రాల స్థాపనకు సంబంధించి మరో సారి టెండర్లను పిలవాల్సి రావడంతో ఈ ప్రక్రియ కాస్తంత ఆలస్యమైందని పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు