గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ

7 Feb, 2017 14:07 IST|Sakshi
గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ

ముంబై: తమిళనాడు ఇంఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు మంగళవారం లేదా బుధవారం చెన్నై వెళ్లనున్నట్టు సమాచారం. తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ చేత ప్రమాణ స్వీకారం చేయించే విషయంలో గవర్నర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం చేసిన రాజీనామాను గవర్నర్ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు అన్నా డీఎంకే చీఫ్‌ శశికళ మంగళవారం ఉదయం ముహూర్తం పెట్టుకున్నారు. ఇందుకు ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. కాగా జయలలిత-శశికళ మీద ఉన్న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వారం రోజుల్లో తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. దీంతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ ప్రమాణం చేయడాన్ని అడ్డుకోవాలంటూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ నేపథ్యంలో గవర్నర్ న్యాయసలహా తీసుకునేందుకు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ నుంచి చెన్నైకు రాకుండా ముంబై వెళ్లడంతో ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో చెన్నై వెళ్లిన తర్వాత గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

చిన్నమ్మ ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా తమిళనాడు సీఎం పన్నీరు సెల్వం రాజీనామా చేయగా, అన్నా డీఎంకే శాసన సభ పక్ష నేతగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి శశికళ పేరును పన్నీరు సెల్వం ప్రతిపాదించగా, మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ మద్దతు పలికారు.

మరిన్ని వార్తలు