పొగాకును నిషేధించాల్సి ఉంది

18 Nov, 2014 02:45 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులను నిషేధించాల్సిన అవసరం ఉందని గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్‌వాలా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు త్వరలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. ‘వృద్ధ వయస్సులో వచ్చే ఆరోగ్యసమస్యలు-నివారణ’ విషయమై బెంగళూరులో సోమవారం జరిగిన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... 90 శాతం క్యాన్సర్ కేసుల్లో వ్యాధి కారకం పొగాకు ఉత్పత్తులేనని గణాంకాలు చెబుతున్నాయన్నారు. అందువల్ల పొగాకును నిషేధించాల్సి ఉంది ప్రాణాంతకమైన పొగాకును రాష్ట్రంలో నిషేధించడం అన్ని విధాల ఉత్తమమని వజుభాయ్ రుడాభాయ్ వాలా అభిప్రాయపడ్డారు.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవడం బాగుంటుందన్నారు.  మారిన జీవన శైలి వల్ల ప్రజలు చిన్న వయసులోనే వివిధ రకాల వ్యాధులకు గురికావాల్సి వస్తోందన్నారు. అయితే శరీరానికి తగినంత శ్రమ ఇవ్వడం వల్ల చాలా రోగాల నుంచి దూరంగా ఉండవచ్చునని ఆయన పేర్కొన్నారు. వృద్ధులకు నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్న పథకాలను రూపొందించాలని సూచించారు. వృద్దాప్యంలో తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరూ చేదోడువాదోడుగా ఉండాలని  కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దినేష్‌గుండూరావ్ పేర్కొన్నారు. కాగా, కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన వైద్య రంగ నిపుణులు ‘వృద్ధాప్య వయస్సులో వచ్చే ఆరోగ్యసమస్యలు-నివారణ విషయం పై రీసర్చ్‌పేపర్లను వెలువరించారు.

మరిన్ని వార్తలు