ప్రజల నెత్తిన సమ్మెట

20 Feb, 2016 03:20 IST|Sakshi
ప్రజల నెత్తిన సమ్మెట

ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వోద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టారు.
ఇదే అదునుగా మరికొన్ని శాఖల ఉద్యోగులు నిరసన గళం విప్పారు.
ఫలితంగా ప్రభుత్వంలో పాలన స్తంభించింది.
ప్రభుత్వం సైతం సవాలు విసురుతున్నట్లుగా వ్యవహరిస్తూ సమ్మె కాలానికి జీతం చెల్లించేది లేదని ప్రకటించింది.

 
* శాఖల వారీగా సమ్మెలు
* సమ్మె కాలానికి జీతం కట్
* నేతన్నల దీక్షలు
* తాజాగా జూడోల హెచ్చరిక

చెన్నై, సాక్షి ప్రతినిధి: కేంద్రప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇవ్వాలని, ఖాళీలను భర్తీ చేయాలని తదితర 20 డిమాండ్లపై తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులు ఈనెల 10వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తమ డిమాండ్ల ఊసే లేకపోవడంతో ఉద్యమాన్ని ఉధృతం చేశారు.

జిల్లా కలెక్టర్ల, తహశీల్దార్ల కార్యాలయాల ముందు వంటావార్పుతో తమ నిరసన వ్యక్తం చేశారు. గురువారం నాటి సమ్మె సమయంలో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీకి దిగడంతో శుక్రవారం నుంచి సమ్మెను మరింత తీవ్రతరం చేశారు. ఈ కారణంగా సచివాలయం సహా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు స్తంభించిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె ఇలా ఉండగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లోని నర్సులు సమ్మెకు పూనుకున్నారు.

పదేళ్లుగా పనిచేస్తున్న నర్సులకు పదోన్నతులు కల్పించాలని తదితర 8 డిమాండ్లపై సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రులు నర్సుల సంక్షేమ సంఘ నేతలతో ప్రభుత్వం చర్చలు జరిపింది తగిన హామీ ఇచ్చింది. 3,500 మంది తాత్కాలిక నర్సులను ఈనెల 10వ తేదీలోగా దశలవారీగా క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చింది. అయితే కేవలం 400 మంది ఉద్యోగాలను మాత్రమే క్రమబద్ధీకరించి చేతులు దులుపుకుంది.

అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీని రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 వేల మంది నర్సులు సమ్మెకు దిగారు. తేనాంపేట డీఎంఎస్ కార్యాలయం వద్ద నిరాహారదీక్షలో పాల్గొన్న ముగ్గురు నర్సులు స్పృహతప్పడంతో 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. నర్సుల సమ్మె కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిల్లో వైద్యసేవలు మందగించాయి.
 
ప్రత్యేక ప్రతిభావంతులు ఆరు డిమాండ్ల కోసం జరుపుతున్న సమ్మె లాకప్‌డెత్ సంఘటనతో ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులను అరెస్ట్ చేసి ఎండలో పెట్టడంతో కుప్పుస్వామి అనే వికలాంగుడు  మృతి చెందడం వారిని రెచ్చగొట్టినట్లయింది.
 
నేతన్నల దీక్షలు: అవినాశి అత్తికడ్డవు నిలత్తడినీర్ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ ఈనెల 8వ తేదీ నుంచి చేనేత కార్మికులు తిరుపూరు జిల్లా వ్యాప్తంగా నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్నారు. ముగ్గురు వ్యక్తులు సృ్పహతప్పడంతో ఆసుపత్రిలో చేర్చి జిల్లా నలుమూలల నిర్వహిస్తున్న నిరాహారదీక్షలను శుక్రవారం జిల్లా కేంద్రానికి తరలించారు. ప్రభుత్వ మొండి వైఖరి ప్రదర్శింస్తోందంటూ 111 మంది గుండుకొట్టించుకుని నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం చేనేత ఉత్పత్తుల ఎగుమతులను నిలిపివేస్తున్నట్లు వారు ప్రకటించారు. అలాగే శనివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నేతపనులను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
 
25 నుండి జూడాల సమ్మె: ఈనెల 25వ తేదీ నుంచి విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రభుత్వ జూనియర్ డాక్టర్ల సంఘం ప్రకటించింది. 7వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు లోపభూయిష్టంగా ఉన్నందున దానిని సవరించాలని, ఖాళీలను భర్తీ చేయాలని తదితర 15 అంశాలతో కూడిన డిమాండ్ల సాధన కోసం సమ్మె పిలుపునిచ్చారు. మూడు రోజులుగా రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. మంత్రి ఓ పన్నీర్ సెల్వం ఈనెల 9వ తేదీన జరిపిన చర్చలు విఫలం కావడంతో 25వ తేదీ నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు పూనుకోవాలని నిర్ణయించారు.
                 
ఎన్నికల వేళ తమ డిమాండ్లు సాధించుకోవాలని ప్రభుత్వ ఉద్యోగుల చేస్తున్న ప్రయత్నాలకు గండికొట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. విధులకు హాజరుకాని రోజులకు జీతాలు చెల్లించేది లేదనే ప్రకటనతో ప్రభుత్వం ఉద్యోగుల సమ్మెను నీరుకార్చేందుకు సిద్ధమైంది.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు