నక్సలిజంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం

5 Jun, 2015 22:51 IST|Sakshi
నక్సలిజంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం

ముంబై: రాష్ట్రంలో పెరుగుతున్న నక్సలిజాన్ని అరికట్టడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి సారథ్యంలో ఓ ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయనున్నారు. సీఎం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో హోం, ఆర్థిక, పీడ బ్ల్యూడీ, రాష్ట్ర, జాతీయ నిఘా విభాగం, రక్షణ విభాగం అధికారులు సభ్యులుగా ఉంటారు. మావోయిస్టులను ఎదుర్కోడానికి  వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను ఈ బృందం అధ్యయనం చేస్తుంది. నక్సలిజాన్ని అదుపుచేయడానికి అవలంభించాల్సిన విధానాలు, వ్యూహాలపై కమిటీ అధ్యయనం చేస్తుంది.

ప్రతి రెండు నెలలకోసారి కమిటీ సమావేశమవుతుందని, రాష్ట్రంలో నక్సలిజాన్ని అదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటుందని ఓ అధికారి తెలిపారు. నక్సలిజాన్ని అణిచివేయడానికి ఇతర రాష్ట్రాలు, కేంద్రంతో కలసి పనిచేస్తుందని చెప్పారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కమిటీ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుందని, అందుకు కావలసిన సామాగ్రిని కూడా సమకూరుస్తుందని చెప్పారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా 2010లో అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఇందులో భాగంగా చత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసుకున్నాయి. అసోం, జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాలు సీఎం నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాయి.

మరిన్ని వార్తలు