ఘనంగా వినాయకుని నిమజ్జనం

13 Sep, 2013 01:48 IST|Sakshi
వేలూరు, న్యూస్‌లైన్: హిందూ మున్నని ఆధ్వర్యంలో వేలూరు పట్టణంలో నిర్వహించిన వినాయకుని నిమజ్జనం భారీ పోలీస్  బందోబస్తు నడుమ సాగింది. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ మున్నని, హిందూ మక్కల్ పార్టీ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో వినాయక చవతి వేడుకలను ఘనం గా నిర్వహించారు. వేలూరు జిల్లాలో సుమారు రెండువేలకు పైగా విగ్రహాలను ప్రతిష్టించగా హిందూ మున్నని అధ్వర్యంలో 1200 విగ్రహాలను ప్రతిష్టిం చారు. వీటిని ప్రతి సంవత్సరం  మూడు, ఐదు, ఏడవ రోజున విగ్రహాలను  ఊరేగింపుగా తీసుకెళ్లి  సదుపేరి చెరువులో  నిమజ్జనం చేస్తారు.  
 
 అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా సత్‌వాచ్చారి ఆంజనేయ స్వామి  ఆలయం నుంచి  సుమారు 150 పెద్ద  వినాయకుని విగ్రహాల ఊరేగింపు ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని హిందూ మున్నని నేత మహేష్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ ఊరేగింపు సైదాపేట మురుగన్ ఆలయం, మెయిన్  బజారు వీధి, కిరుబానంద వారియార్ వీధి, కొనవట్టం తదితర ప్రాంతాల మీదుగా భారీ పోలీస్ బందోబస్తు నడుమ సదుపేరి చెరువు వద్దకు చేరుకుంది. అనంతరం చెరువు వద్ద విగ్రహాలకు పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ విజయకుమార్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
 
మరిన్ని వార్తలు