అపూర్వ స్వాగతం

2 Nov, 2016 02:43 IST|Sakshi
అపూర్వ స్వాగతం

ఐదేళ్ల అనంతరం బళ్లారికి  గాలి జనార్దనరెడ్డి
దారి పొడవునా కిక్కిరిసిన జనం 

బళ్లారి : రాష్ర్ట మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి బళ్లారి జిల్లాలో అపూర్వ స్వాగతం లభించింది. ఐదేళ్ల తర్వాత ఆయన మంగళవారం బళ్లారికి విచ్చేయడంతో  జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. హైదరాబాద్ నుంచి కర్నూలు మీదుగా వచ్చిన ఆయనకు హగరి వద్ద వేలాదిగా తరలివచ్చిన జనం  భారీ పూలమాలలు వేస్తూ స్వాగతం పలికారు. హగరి నుంచి అమరాపురం, కక్కబేవినహళ్లి, బేవినహళ్లి, బిసిలహళ్లి మీదుగా బళ్లారి వరకు దారి పొడవునా ప్రజలు హారతులు ఇస్తూ స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చుతూ తమ అభిమాన నాయకుడికి కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. దీంతో హగరి-బళ్లారి మధ్య ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టాప్ లేని వాహనంపై జనార్దన్‌రెడ్డి నిలబడి దాడి పొడవునా అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు.

నగరంలోని శ్రీకనకదుర్గమ్మ దేవాలయంలో గాలి పూజలు నిర్వహించిన అనంతరం వాల్మీకి, భువనేశ్వరి దేవి విగ్రహాలకు పూజలు నిర్వహించిన అనంతరం హవంబావిలోని తన స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ... తన ఊపిరి ఉన్నంత వరకు బళ్లారి జిల్లా ప్రజల సేవకే అం కితమవుతాయని అన్నారు.  ఎంపీ బీ.శ్రీరాములు,  మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి, బళ్లారి మాజీ ఎంపీ శాంత, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ ఇబ్రహీం బాబు, మాజీ ఉప మేయర్ శశికళ, పలువురు కార్పొరేటర్లు, జిల్లా పంచాయతీ మెంబర్లు, బళ్లారి జిల్లా బీజేపీ అధ్యక్షుడు గురులింగనగౌడ, బళ్లారి జిల్లా బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు ప్రకాష్‌రెడ్డి ఆయన వెంట ఉన్నారు.

మరిన్ని వార్తలు