కనులారా రాములోరి కల్యాణం

8 Apr, 2014 22:55 IST|Sakshi

భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలోని పద్మనగర్ ప్రాంతంలోని శ్రీ రామ మందిర ప్రాంగణంలో రాములోరి కల్యాణం అంగరంగా వైభవంగా జరిగింది. గత 25 సంవత్సరాలుగా నవమి వేడుకలు నిర్వహిస్తున్న శ్రీ రామ మందిర్ ట్రస్ట్ సభ్యులు ఈసారి కూడా మందిరాన్ని రంగు రంగు పుష్పాలు, విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ నెల మూడో తేదీ నుంచి నిత్య పూజా కార్యక్రమాలతో పాటు రామాయణ పారాయణం, హోమం, అభిషేకాలు నిర్వహించారు.

మంగళవారం ఉదయం ప్రభాత భే రి, సంపూర్ణ గీతా పారాయణం, యజ్ఞం నిర్వహించిన అనంతరం అభిజిత్ లగ్నమందు స్వామివారికి కల్యాణ తంతు ప్రారంభించి ఉదయం 11.45 గంటలకు మాంగల్యధారణ చేశారు. ఈ కమనీయ కల్యాణాన్ని తిలకించడం కోసం పద్మనగర్ ప్రాంతవాసులతో పాటు కామత్‌ఘర్, అంజూర్‌పాట, నాయిబస్తీ, బాలాజీనగర్, నార్‌పోళి దేవ్‌జీనగర్, బండారి కాంపౌండ్, కోమల్‌పాడ, సంఘం పాడ నుంచి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. వివాహనంతరం స్వామివారికి మహిళా భక్తులు వడి బియ్యం, కానుకలు సమర్పించుకున్నారు. 12 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో సుమారు 10 వేల మందికి పైగా భక్తులు పాల్గొన్నారని నిర్వాహకులు డాక్టర్ అంకం నర్సయ్య, కట్ల మల్లేశ్, చేర్యాల వెంకటి తెలిపారు.
 
 దాదర్‌లో...
 సాక్షి, ముంబై: దాదర్‌లోని ఆంధ్రమహాసభ ఆవరణలో మంగళవారం ఉదయం శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. ఉదయం నుంచి పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాసభ అధ్యక్షుడు సంకు సుధాకర్, శ్రీ వేంకటేశ్వర పూజ మందిర ట్రస్టీ ఏఎస్‌ఆర్‌కే ప్రసాద్ దంపతులు పాల్గొని వేదమంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా రాములోరి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. తర్వాత అష్టోత్తర అర్చన, మహిళా శాఖవారు భక్తి గీతాలు ఆలపించారు. దీంతో భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారు. అనంతరం మహాసభ మాజీ అధ్యక్షుడు డాక్టర్.జి.హరికిషన్ సీతారాములకు మంగళహారతులు ఇచ్చిన తర్వాత పూజా కార్యక్రమాలు ముగిశాయి. ఆ తర్వాత భక్తులు శ్రీ సీతారాములను దర్శించుకున్నారు.

 శ్రీ వేంకటేశ్వర పూజా మందిర ట్రస్టీ చైర్మన్ కె.ఎస్.కృష్ణమూర్తి, కార్యదర్శి కె.ఎస్.ఆర్.మూర్తి, సభ్యులు ఓ.సుబ్రహ్మణ్యం, ఆంధ్ర మహాసభ ధర్మకర్తలు, కె. రమేశ్‌బాబు, ప్రధాన కార్యదర్శి యాపురం వెంకటేశ్వర్, కస్తూరి హరిప్రసాద్‌లతోపాటు మహిళాశాఖ అధ్యక్షురాలు పి.భారతలక్ష్మి, కార్యదర్శి సోమల్ లత, ఉపాధ్యక్షురాలు టి.కరుణశ్రీ, సంయుక్త కార్యదర్శి టి.అపరాజిత, సభ్యులు భోగ జ్యోతిలక్ష్మి, పి.పద్మ, పి.దేవి రావు, సంగెవేని విజయ, వై.లత తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

 ఉల్లాస్‌నగర్‌లో...: ఉల్లాస్‌నగర్‌లోని బాలాజీ ముంబై తెలుగు సమాజ్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఫార్వర్డ్‌లైన్ వాల్మీకినగర్‌లోని ఓ శివాలయంలో ఉన్న సీతారాముల విగ్రహాలను తీసుకొచ్చి  స్థానిక పూజా పంచాయతీ హాలులో కల్యాణం నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానికంగా ఉంటున్న  తూర్పు గోదావరి జిల్లా అమలాపురం తాలూకా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
 ప్రభాదేవిలో...: ప్రభాదేవిలోని భగవాన్ శ్రీసత్యానందమహర్షి భక్త మండలి ఆధ్వర్యంలో మంగళవారం శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంతో భక్తిశ్రద్ధ్రలతో ఉగాది పర్వదినం నుంచి కొనసాగిన ‘అఖండ హరినామ సంకీర్తన సప్తాహ’ మంగళవారం ముగించారు. శ్రీ రామ నవమి ఉత్సవాలు పుర స్కరించుకుని మంగళవారం ఉదయం హోమం, పూజ, ఇతర అర్చన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం లాలిపాటలతో శ్రీరామ జన్మదిన వేడుకలను నిర్వహించారు. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలతోపాటు అన్నదానం కూడా చేసినట్లు మండలి కార్యదర్శి పురుషోత్తం చెప్పారు.

 షిర్డీలో...: సాక్షి, ముంబై: షిర్డీలో సాయిబాబా సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీరామ నవమి ఉత్సవాలు మంగళవారం అంగరంగా వైభవంగా జరిగాయి. సోమవారం రాత్రంతా ఆలయాన్ని తెరిచే ఉంచడంతో లక్షలాది మంది భక్తులు బాబా సమాధిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం కాకడ్ ఆరతి, అనంతరం ద్వారకామయిలో సోమవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన అఖండ పరాయణ పఠనం ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా దాదాపు నాలుగు వేల మంది భక్తులు కావడితో తీసుకొచ్చిన శుద్ధమైన నీటితో బాబాకు జలాభిషేకం చేశారు. అనంతరం బాబా చిత్రపటం, పవిత్ర గ్రంథాన్ని ఊరేగించారు.

ఆలయం పక్కనే ఏర్పాటుచేసిన వేదికపై ఉదయం 10 గంటలకు విక్రం నాందేడ్కర్ అనే భక్తుడు రాముని జీవిత చరిత్రను హరికథ రూపంలో వివరించారు. అనంతరం బాబా రథాన్ని షిర్డీ పురవీధుల్లో ఊరేగించారు. ఇందులో సాయి భక్తులు పెద్ద సంఖ్యలో పొల్గొన్నారు. దీంతో షిర్డీ పుణ్యక్షేత్రం మంగళవారం పూర్తిగా రామనామ స్మరణతో మారుమోగింది. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. భక్తులకు ఎలాంటి లోటులేకుండా బాబా సంస్థాన్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులు బస చేసేందుకు టెంట్లు, మండపాలు, షామియాలు, తాగునీరు, సంచార మరుగుదొడ్లు, స్నానాలకు ట్యాంకర్లు, లడ్డు ప్రసాదం తదితర సౌకర్యాలు కల్పించారు. ఉత్సవాల సందర్భంగా మంగళవారం కూడా భక్తులకి ఉచిత భోజన వసతి కల్పించారు.

ముంబైకి చెందిన సునీల్ అగ్రవాల్, గోండియా జిల్లాకు చెందిన సుశీలాదేవి మాసాని, అహ్మదాబాద్‌కు చెందిన దిలీప్ మెహత, బెంగళూర్‌కు చెందిన శ్రీనివాస్ శిర్గూకర్, భువనేశ్వర్‌కు చెందిన దుశ్యంతకుమార్, డెహరాడూన్‌కు చె ందిన సచిన్‌కుమార్, అమెరికాకు చెందిన సీతా హరిహరణ్ తదితర దాతలు అందించిన విరాళాలతో ఉచిత భోజనం కల్పించినట్లు బాబా సంస్థాన్ అధ్యక్షుడు బాలచంద్ర దేబాడ్వార్ చెప్పారు.

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు