శ్రీనివాసా... గోవిందా

23 Apr, 2014 22:18 IST|Sakshi

 పింప్రి, న్యూస్‌లైన్: చించ్‌వడ్‌లోని శ్రీవేంకటేశ్వర (బాలాజీ) దేవాలయంలో 12వ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున తెలుగు ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో పరిసరాల్లో భక్తిమయ వాతావరణం నెలకొంది. ఏడు కొండల వాడా...వెంకటరమణా గోవిందా...గోవిందా నినాదాలతో మారుమోగింది. మొదటి రోజు ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం వేకువ జామునుంచే ఆలయంలో ప్రత్యేక  పూజలు చేశారు. మొదట విఘ్నేశ్వర పూజ చేశారు. ఆంధ్రప్రదేశ్ భీమవరం నుంచి వచ్చిన చంద్రశేఖర శర్మ గోపూజ చేశారు.

 గోపూజ మహాత్మ్యం గురించి భక్తులకు వివరించారు. గోవు సమస్త దేవతలకు ప్రతిరూపమని, గోపూజ చేసిన తర్వాతనే ఎలాంటి పూజా కార్యక్రమాన్నైన్నా ప్రారంభించాలని పేర్కొన్నారు. ఆవు పంచకంతో సర్వ పాపహరణం జరుగుతుందని ఉద్బోధించారు. తర్వాత శ్రీవారికి అభిషేకం తదితర ప్రత్యేక పూజలతోపాటు అర్చనలు నిర్వహించారు. సాయంత్రం జరిగిన అంకురార్పణ, ధ్వజారోహణ, దీక్షాధారణ, అగ్ని ప్రతిష్ఠాపన పూజలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో తెలుగు వారితోపాటు మరాఠీయులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు...
 వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేందుకు మందిరం ట్రస్ట్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఎలాంటి తోపులాట  జరగకుండా ఆలయ నిర్వాహకులు ప్రాంగణంలో క్యూపద్దతి కోసం రేలింగ్ ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా తెలుగు ప్రజలు భారీగా తరలివచ్చారు. అందరికీ మహా ప్రసాదాన్ని నిర్వాహకులు పంపిణీ చేశారు. భక్తుల సౌకర్యార్ధం నీడనిచ్చేందుకు పచ్చటి పందిరి, మంచి నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు