ఆమోదం లభిస్తే ఆనందమే

8 Oct, 2013 02:08 IST|Sakshi
నోయిడా: జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో ఉద్యోగాలు చేసేవారికి శుభవార్త. ఢిల్లీ మెట్రోను గ్రేటర్ నోయిడా వరకూ పొడిగించేందుకు సంబంధించిన ప్రతిపాదనను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం కోసం కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖకు ఇటీవల పంపింది. ఇందుకు కేంద్రం పచ్చజెండా ఊపితే నోయిడా, గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ పరిధిలో ఇళ్లు కొనుగోలు చేసిన ఉద్యోగులు అక్కడి నుంచి ఎన్సీఆర్‌లోని తమ తమ కార్యాలయాలకు రాకపోకలు సాగించడం మరింత సులువవుతుంది.
 
 కాగా మున్ముందు నోయిడాలో నివసించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఇటీవల జరిపిన అనేక అధ్యయనాల్లో తేలింది. మరోవైపు ఇదే సమయంలో ఢిల్లీలో విక్రయానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల సంఖ్య అంతంతమాత్రంగానే ఉంది. ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్ ప్రకారం 2031 నాటికి నోయిడా జనాభా సంఖ్య దాదాపు 25 లక్షలకు చేరుకునే అవకాశముంది. మరోవైపు తదుపరి దశాబ్దకాలం ముగింపు నాటికి ఢిల్లీ నగరంలో ఆవాసాల కొరత సంఖ్య 24 లక్షల దాకా ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఢిల్లీలో ఇళ్ల కొరత సమస్య నానాటికీ పెరిగిపోతుండడంతో అనేకమంది నోయిడా పరిసర ప్రాంతాల్లో ఇళ్లు కొనుగోలు చేసి రాకపోకలు సాగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు.  మరోవైపు ఎక్స్‌ప్రెస్ వే వెంబడి తాము చేపట్టిన అనేక ప్రాజెక్టులు 2017 నాటికల్లా పూర్తవుతాయని, అదే సమయానికి మెట్రో కారిడార్ పనులు కూడా పూర్తవుతాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. 
 
 ‘ఎక్కువ అద్దె చెల్లించాల్సి వస్తోంది’
 గుర్గావ్‌లోని తన కార్యాలయానికి సమీపంలోనే ఇంటిని అద్దెకు తీసుకున్నానని అంకిత్ పాల్ అనే ఓ ఇంజనీర్ చెప్పాడు. అయితే ఎక్కువ మొత్తంలో అద్దె చెల్లించక తప్పడం లేదన్నాడు. మెట్రో మార్గం అందుబాటులోకి వస్తే సెక్టార్ 78కి మారుస్తానన్నాడు. కాగా కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖకు యూపీ ప్రభుత్వం పంపిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) ప్రకారం ప్రతిపాదిత మెట్రో కారిడార్ సెక్టార్ 32లోని నోయిడా సిటీ సెంటర్ నుంచి ప్రారంభమవుతుంది. ఇది 50, 51, 78, 101, 81, దాద్రి రోడ్, 85, 137, 142, 143,144, 147, 153లతోపాటు నోయిడాలోని సెక్టార్ 149ల మీదుగా గ్రేటర్ నోయిడాకు చేరుతుంది.
 
>
మరిన్ని వార్తలు