అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్

24 Sep, 2014 02:16 IST|Sakshi
అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్

సాక్షి ప్రతినిధి, బెంగళూరు :  రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ నివాస  కట్టడాలను క్రమబద్ధీకరించనున్నట్లు న్యాయ శాఖ మంత్రి టీబీ జయచంద్ర తెలిపారు. అయితే తక్కువ విస్తీర్ణంలో నిర్మించిన ఇళ్లను మాత్రమే క్రమబద్ధీకరిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ పట్టణాల్లో 1,200 చదరపు అడుగులు, గ్రామాల్లో 2,400 అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన నివాస కట్టడాలను మాత్రమే క్రమబద్ధీకరిస్తామని చెప్పారు.
 
దీనికి సంబంధించి భూ సంస్కరణల చట్టానికి కూడా సవరణలు తెచ్చామన్నారు. కాగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనికి సంబంధించి ఏటీ. రామస్వామి, బాలసుబ్రమణ్యం నివేదికల ఆధారంగా ఆక్రమణలను తొలగించాలని యోచిస్తున్నట్లు చెప్పారు.
 
దీని కోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణల కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి ప్రత్యేక న్యాయ స్థానాలను నెలకొల్పాలని కూడా యోచిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి వెనక్కు తీసుకోవడానికి ఉద్దేశించిన చట్టానికి ఉభయ సభల ఆమోదం లభించిందని చెబుతూ, రాష్ట్రపతి అనుమతి లభించిన వెంటనే భూకబ్జాదారులపై నిర్దాక్షిణ్యంగా చర్యలు చేపడతామని హెచ్చరించారు. కొత్త చట్టం ప్రకారం భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు కబ్జాదారులపై క్రిమినల్ కేసులను నమోదు చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు