దేశమంతా చిల్లర గోల.. అక్కడ గ్రూపుల గోల

14 Nov, 2016 15:50 IST|Sakshi
దేశమంతా చిల్లర గోల.. అక్కడ గ్రూపుల గోల
గుడివాడ టీడీపీలో అసమ్మతి సెగలు 
కొత్తవారిని కలుపుకోలేమంటున్న పాత నేతలు
జనచైతన్య యాత్రలకు పిలవడం లేదు
పార్టీ వీడుతామంటున్న బీసీ నేతలు
 
గుడివాడ : దేశమంతా చిల్లర గొడవ సాగుతుండగా.. గుడివాడలో మాత్రం అధికార పార్టీలో గ్రూపుల గోల ఎక్కువైంది. కొత్తగా పార్టీలో చేరినవారిని కలుపుకుని వెళ్లేందుకు పాత నాయకులు అంగీకరించడంలేదు. కనీసం టీడీపీ చేపట్టిన జన చైతన్యయాత్రలకు కూడా పిలవడం లేదు. టీడీపీలోని కొందరు బీసీ నేతలు ఏకంగా ‘వారు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టే మేం తెలుగుదేశంలో కొనసాగుతున్నాం. ఇక మేం టీడీపీలో ఉండలేం. సామూహికంగా వెళ్లిపోతాం..’ అని నియోజకవర్గ నేతల వద్ద చెప్పినట్లు సమాచారం. 
 
గెట్‌ టు గెదర్‌లో రగడ 
మున్సిపల్‌ చైర్మన్‌ యలవర్తి, కౌన్సిలర్లు టీడీపీలో చేరిక అనంతరం వారం రోజుల క్రితం స్థానిక ఏలూరు రోడ్డులోని ఓ రెస్టారెంట్‌లో వార్డు స్థాయి నేతలతో గెట్‌ టు గెదర్‌ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాత టీడీపీ నేతలంతా నియోజకవర్గ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. ‘రేపు వేరే పార్టీలో ఉన్న నేతను చేర్చుకుంటున్నాము. ఆయనే మీకు ఎమ్మెల్యే అభ్యర్థి అంటే మీరు ఆహ్వానిస్తారా.. మీరు వెళతారా..’ అని ప్రశ్నించినట్లు తెలిసింది. అర్ధరాత్రి 11 గంటల సమయంలో తమకు ఫోన్‌ చేసి వీరిని దొంగతనంగా పార్టీలో చేర్చుకోవాల్సిన గతి ఎందుకొచ్చిందని నిలదీసినట్లు సమాచారం. ‘రెండున్నరేళ్లు వీరితో మేం రాజకీయంగా పోరాటం చేశాం. ఇప్పుడు కలిసి ఎలా ఉంటాం...’ అని మరికొందరు చెప్పగా, ‘యలవర్తి ఆ పార్టీలో ఉన్నారు. కాబట్టి మేం ఈ పార్టీలో చేరాం. ఇలా అయితే మేం పార్టీ మారతాం..’ అని కొందరు బీసీ నేతలు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో పలువురు బీసీ నేతలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. దీంతో వారిని బుజ్జగించే పనిలో రావి నిమగ్నమయ్యారని ఓ నాయకుడు చెప్పారు. 
 
లింగం ప్రసాద్‌కు బుజ్జగింపులు 
గెట్‌ టు గెదర్‌ కార్యక్రమంలో టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ లింగం ప్రసాద్‌ బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేసినట్లు తెలిసింది. ‘మున్సిపల్‌ ఎన్నికలు జరిగిన మొదట్లో పార్టీలోకి ఆహ్వానించాం. ఆయన రాలేదు. ఈ రోజు ఎందుకు వచ్చారు. ఎందుకు చేర్చుకున్నారు. కౌన్సిల్‌ ప్రారంభం నుంచి నేటి వరకు ముగ్గురు పిల్లల వ్యవహారంపై రాజీ లేని పోరాటం చేశాను. ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతాం’ అని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. అయితే ఇవన్నీ విన్న రావి... లింగం ప్రసాద్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. లింగం ప్రసాద్‌కు నామినేటెడ్‌ పదవి ఇచ్చి ఆయన్ను శాంతింపజేసేందుకు పార్టీ జిల్లా స్థాయి నేతలతో మాట్లాడతున్నట్లు సమాచారం. గుడివాడలోని టీడీపీ నేతల మధ్య గ్రూపుల గోల ఎటు దారితీస్తోందని ఆ పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 
మరిన్ని వార్తలు