జీఎస్టీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

9 Sep, 2016 02:52 IST|Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రధాని మోదీ అమల్లోకి తీసుకురావాలనుకుంటున్న వస్తు, సేవల పన్ను బిల్లు(జీఎస్టీ)కు మరో అడుగు ముందుకు పడింది. ఈ బిల్లు రాజ్యాంగ సవరణకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. కాగా, త్వరలో దీనిపై పన్ను రేటు, సెస్, సర్‌చార్జీలు నిర్ణయించనున్నారు. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, సేవల పన్ను, కేంద్ర అమ్మకం పన్ను, అదనపు కస్టమ్స్ సుంకం వంటి వివిధ పన్నులను కలిపి ఒకే పన్నుగా చేయడమే వస్తు, సేవల పన్ను.

ఆగస్టు 8న ఈ బిల్లు ఆమోదానికి కేంద్రం అన్ని రాష్ట్రాల అంగీకారం కోరింది. రాజ్యాంగ సవరణ బిల్లుకు కనీసం 50 శాతం రాష్ట్రాల మద్దతు అవసరం. కేంద్రం ఈ బిల్లును మొదట 17 రాష్ట్రాలకు పంపించగా, అస్సాం మొట్టమొదట అంగీకరించింది. అనంతరం ఏపీ, బిహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, నాగాలాండ్, మహారాష్ట్ర, హరియాణా, సిక్కిం, మిజోరం, తెలంగాణ, గోవా, ఒడిశా, రాజస్తాన్ ఆమోదించాయి.

>
మరిన్ని వార్తలు