టార్గెట్‌ లక్ష కోట్లు

6 Jul, 2017 03:30 IST|Sakshi
టార్గెట్‌ లక్ష కోట్లు

కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన జీఎస్టీ విధానం ద్వారా ఖజానాను భారీస్థాయిలో నింపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఏడాదికి కనీసం రూ.లక్ష కోట్ల వసూళ్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేగాక ఇందుకు అదనంగా పెట్రోలు, డీజిల్‌ అమ్మకాల ద్వారా రూ.30 వేల కోట్లను సమకూర్చుకోవాలని తహతహలాడుతోంది.
జీఎస్టీ వసూళ్లపై  ప్రభుత్వ లక్ష్యం
పెట్రోలు, డీజిల్‌ ద్వారా అదనంగా రూ.30వేల కోట్లు

సాక్షి ప్రతినిధి, చెన్నై : జీఎస్టీ వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వాణిజ్య పన్నులశాఖ ద్వారా విలువ ఆధారిత పన్ను (వ్యాట్‌), అమ్మకపు పన్ను, లగ్జరీ పన్ను, వినోదపు పన్ను, ప్రవేశపన్ను ఇలా అనేక పేర్లతో పన్నుల వసూళ్లు జరిగేవి. ఈ పన్నుల ద్వారా ప్రభుత్వాలు తమ ఆదాయాలను బేరీజు వేసుకునేవి. ఏడాదికి రూ.20 లక్షల ఆదాయం పొందే ప్రతి వ్యాపార సంస్థ ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి.

ఆదాయ వ్యయాల వివరాలను ఏటా అందజేయాలి. వ్యాపారస్తులు అమ్మే అన్ని వస్తువులకు వివిధ స్థాయిలో పన్నులు విధించేవారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సరుకులకు ప్రవేశపన్ను విధించేవారు. తమిళనాడుకు సంబంధించి 5, 10.5, 14.5 శాతం పన్నులు వసూలు చేసేవారు. ఈ పన్నుల ద్వారా ప్రతి ఏడాది సగటున రూ.60 వేల కోట్ల వరకూ వసూలయ్యేది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో 70 శాతం వాణిజ్య పన్నుల ద్వారా అందేది.

ఈ దశలో కేంద్రం ‘ఒకే  దేశం.. ఒకే పన్ను’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా జీఎస్టీ కొత్త విధానాన్ని ఈనెల 1వ తేదీ నుంచి ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ద్వారా 5, 12, 18, 28 శాతాలుగా నాలుగు రకాల పన్నులను ప్రవేశపెట్టారు. తమిళనాడు వరకు పరిశీలిస్తే ఇంతవరకు 8 రకాల పన్నులను వేర్వేరుగా విభజించి వసూలు చేసేవారు. ఇక జీఎస్టీ అనే పన్ను రూపంలో వసూళ్లు ఉంటాయి. ఇప్పటివరకు సరుకులకు రాష్ట్ర ప్రభుత్వమే పన్ను విధించేది. ఇకపై సర్వీసు టాక్సును సైతం రాష్ట్రప్రభుత్వం వసూలు చేయనుంది. ప్రతి ఒక్క పన్నులోనూ రాష్ట్ర పన్ను, కేంద్ర పన్ను అని విభజించనున్నారు. ముఖ్యంగా 18 శాతం పన్ను విధిస్తే చెరీ 9శాతం లెక్కన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం మరింత పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. వాణిజ్యశాఖ నుంచే రూ.ఒక లక్ష కోట్ల పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

ఎవరూ తప్పించుకోలేరు
రాష్ట్ర ప్రభుత్వ భారీ లక్ష్యంపై ఒక అధికారి మాట్లాడుతూ, 2014–15 ఆర్థిక సంవత్సరంలో రూ.60,314కోట్లు, 2015–16లో రూ.61,709కోట్లు, 2016–17లో రూ.67, 576కోట్లు పన్ను వసూళ్లు సాధించినట్లు తెలిపారు. జీఎస్టీ అమల్లోకి వచ్చినందున 2016–17 రూ.79 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గతంలో ప్రభుత్వం వసూళ్ల లక్ష్యం పెట్టుకున్నా పన్నుల విధానంలో లొసుగులు, పన్నుల ఎగవేత వల్ల సాధించలేకపోయిందని తెలిపారు.

జీఎస్టీ వల్ల ఎవరూ పన్ను చెల్లించకుండా తప్పించుకోలేరని ఆయన చెప్పారు. తమిళనాడు పన్నుల వసూళ్లను ఇకపై ప్రభుత్వమే స్వయంగా నిర్వహిస్తున్నందున ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఈ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.లక్ష కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకునట్లు ఆయన వివరించారు. జీఎస్టీ నుంచి పెట్రోలు, డీజిల్, మద్యం మినహాయింపుతో ఏడాదికి రూ.30వేల కోట్లు అదనంగా రాబట్టుకోవడం ఖాయమని వాణిజ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు