గంజ్ షట్టర్ల లీజుపై ఆరా!

14 Oct, 2016 14:04 IST|Sakshi
గంజ్ షట్టర్ల లీజుపై ఆరా!
 
  వ్యాపారులతో సమావేశమైన మేయర్, డీఈవో
  అద్దెలు విద్యాశాఖకు చెల్లించాలని ఆదేశం
  మళ్లీ వేలం లేకుండా చేసుకునేందుకు పన్నాగం
  శిథిలమైన గంజ్‌ైెహ స్కూల్ కూల్చివేతకు నిర్ణయం
  24 గంటల నల్లా కనెక్షన్ బిగింపు 
 
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నడిబొడ్డున పురాతన గంజ్ హైస్కూల్ షట్టర్ల వ్యవహారంపై మేయర్ రవీందర్‌సింగ్, డీఈవో పి.రాజీవ్ గురువారం ఆరా తీశారు. ఈనెల 1న ‘కదలరు.. వదలరు..’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి వారు స్పందించారు. సర్కారు బడి ఆస్తులకు సంబంధించి అద్దెలు విద్యాశాఖకు రాకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యాపారులతో సమావేశమై అద్దెలపై చర్చించారు. 2008తో ఆర్‌అండ్‌బీతో లీజు ముగిసినప్పటికీ గంజ్ హైస్కూల్‌కు ఒక్క రూపాయి చెల్లించకపోవడంపై ప్రశ్నించారు. విద్యాశాఖకు అద్దెలు చెల్లించాలని తమకు ఎవరూ చెప్పలేదని, ఇకనుంచి ఎంత అంటే అంత అద్దె చెల్లిస్తామని వ్యాపారులు తెలిపారు. గంజ్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు అకౌంట్‌లో జమచేయాలని డీఈవో సూచించారు.
 
వేలం అడ్డుకునే పన్నాగం 
గంజ్ హైస్కూల్‌కు సంబంధించిన 21 షట్టర్లకు వేలం వేయకుండా మళ్లీ సదరు వ్యాపారులే దక్కించుకునేలా పన్నాగం నడుస్తోంది. అందుకు ప్రజాప్రతినిధులు సై అంటున్నట్లు తెలుస్తోంది. వేలం వేస్తే ఒక్కో షట్టర్‌కు రూ.20వేలు అద్దెతో పాటు సుమారు రూ.2 లక్షల వరకు డిపాజిట్ల రూపంలో వచ్చే అవకాశం ఉంది. ఇంత ఆదాయం వస్తే పాత భవనం కూల్చి వేసి అదే స్థలంలో కొత్త భవనాన్ని నిర్మించొచ్చు. అరుుతే సదరు వ్యాపారులు ఒక్కో షట్టర్‌కు రూ.3వేలు అద్దె ఇస్తామనడం గమనార్హం. ఇదే జరిగితే మరో ఐదేళ్ల వరకు ఒక్క రూపాయి కూడా అద్దె పెరగకుండా తిష్టవేయవచ్చనేది వ్యాపారుల పన్నాగం.
 
శిథిల భవనం తొలగిస్తాం 
గంజ్ హైస్కూల్ పాత పాఠశాల భవనం పూర్తిగా శిథిలమైందని వెంటనే తొలగించాలని కోఆప్షన్ సభ్యుడు కన్న కృష్ణ మేయర్‌కు విన్నవించారు. స్పందించిన ఆయన పరిశీలించి తొలగించాల్సిందిగా అదనపు కమిషనర్ వెంకటేశంకు సూచించారు.  
 
 24 గంటల నల్లా బిగింపు
 గంజ్ హైస్కూల్‌లో విద్యార్థులకు తాగునీటి సౌకర్య కల్పించేందుకు 24 గంటల నల్లా కనెక్షన్ బిగింపునకు మేయర్ రవీందర్‌సింగ్  హామీ ఇచ్చారు. వెంటనే భూమి పూజ చేశారు.  
 
స్క్రాప్‌నకు వేలం వేయండి 
శిథిలమైన పాత పాఠశాల భవనాన్ని కూల్చివేస్తే విలువైన టేకు కర్రతోపాటు ఇనుపరాడ్లు వెలువడుతాయని వాటికి వేలం వేయూలని పాఠశాల ఉపాధ్యాయులను డీఈవో కోరారు. వేలం ఆలస్యమైతే కర్రను ఒక గదిలో భద్రపరచాలని సూచించారు.  వేలం ద్వారా వచ్చే నిధులను పాఠశాల అభివృద్ధి కేటాయిస్తామన్నారు. 
 
హైస్కూల్ అభివృద్ధికి సహకరిస్తాం
గంజ్ హైస్కూల్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు చేపడుతున్న అభివృద్ధి పనులకు పూర్వ విద్యార్థులుగా సహకరిస్తాం. అత్యవసరంగా వాటర్ ప్యూరిఫైడ్‌ను ఏర్పాటు చేస్తాం. భవన నిర్మాణం చేపడితే నిధులు సేకరించి ఇస్తాం.
- రవీందర్‌సింగ్, మేయర్
మరిన్ని వార్తలు