పేలుడులో సిద్ధిక్ హస్తం

16 May, 2014 00:58 IST|Sakshi

సాక్షి, చెన్నై: సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో పేలుడు వెనుక తీవ్రవాది అబూబక్కర్ సిద్ధిక్ హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణలో లభిస్తున్న సమాచారం ఇందుకు బలం చేకూరుస్తున్నట్టు తెలిసింది. కోల్‌కతాలో సీబీసీఐడీ జరిపిన దర్యాప్తు మేరకు సిద్ధిక్ అనుచరులు రాష్ట్రంలో తిష్ట వేసి ఉన్నట్టు తేలింది. సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోజరిగిన గువాహటి ఎక్స్‌ప్రెస్ పేలుడు దర్యాప్తు సీబీసీఐడీకి సవాల్‌గా మారింది. ఈ ఘటన వెనుక ఉన్న అదృశ్య శక్తుల్ని గుర్తించడంలో తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. ప్రత్యేక బృందాలు బెంగళూరు, బీహార్‌లో తిష్ట వేసి దర్యాప్తును సాగిస్తూనే వస్తున్నాయి. పలు కోణాల్లో దర్యాప్తు సాగుతున్నా, చిన్నపాటి ఆధారం కూడా లభించడం లేదు. దీంతో కేసు ఛేదింపు మరి కొన్ని నెలలు పట్టేనా? లేదా సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో గతంలో జరిగిన రైలు హైజాక్ ఘటన విచారణ మాదిరిగా మిస్టరీ అయ్యేనా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. బెంగళూరులో లభించిన చిన్న క్లూ ఆధారంగా కోల్‌కతాకు ప్రత్యేక బృందం వెళ్లి ఉన్నది. అక్కడ జరుగుతున్న దర్యాప్తు మేరకు తమిళనాడుకు చెందిన అజ్ఞాత తీవ్రవాది సిద్ధిక్ ప్రమేయం ఉండొచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి.
 
 జాడ ఏదీ?: తమిళనాడుకు చెందిన అజ్ఞాత తీవ్ర వాదులు నలుగురిలో ముగ్గురు ఇటీవల పట్టుబడ్డారు. చైన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ లాడ్జీలో పోలీసు ఫకృద్దీన్ పట్టుబడడం, అతడు ఇచ్చిన సమాచారంతో ఇస్మాయిల్, బిలాల్‌ను పుత్తూరులో అరెస్టు చేశారు. వీరు పట్టుబడినా, మరో ప్రధాన అజ్ఞాత తీవ్ర వాది అబూబక్కర్ సిద్ధిక్ జాడ మాత్రం తెలియడం లేదు. ఇత డిని పట్టిస్తే రివార్డులు సైతం ఎదురు చూస్తున్నాయి. ఇతడి కోసం రాష్ట్రంలో జల్లెడ పట్టినా ఫలితం శూన్యం. తరచూ రాష్ట్రానికి మాత్రం వచ్చి వెళ్లే వాడని కోల్‌కతాలో లభించిన సమాచారంతో ఈ పేలుడు వెనుక సిద్ధిక్ హస్తం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నారుు.
 
 ఇతడు సౌత్ ఇండియన్ ముజాహిద్దీన్ పేరిట రహస్యంగా ఓ సంస్థను నడుపుతున్నట్టు, తమిళనాడుకు చెందిన యువతను వలలో వేసుకున్నట్టుగా విచారణలో వెలుగు చూసింది. దీంతో కోల్‌కతా వెళ్లిన ప్రత్యేక బృందం రాష్ట్రంలోని ఉన్నతాధికారులకు సమాచారం పంపింది. దీంతో రాష్ట్రంలో సిద్ధిక్ మద్దతుదారులు, అనుచరుల కోసం వేట ఆరంభం అయింది. ఇటీవల బెంగళూరు బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన బాంబు పేలుడు కేసు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల చుట్టూ తిరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆ జిల్లాల్లో సిద్ధిక్ అనుచరగణం నక్కి ఉండొచ్చన్న అనుమానాలు నెలకొన్నాయి. వీరి కోసం రహస్య వేట శరవేగంగా సాగుతోంది.

మరిన్ని వార్తలు