మోదీ అప్పుడే స్పందిస్తే బాగుండేది

29 Jun, 2016 18:29 IST|Sakshi

 చెన్నై: ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌పై జరుగిన దుష్ర్పచారాన్ని కేంద్ర ప్రభుత్వం సకాలంలో అడ్డుకున్నట్లయితే ఆయన మరో పర్యాయం ఆర్‌బీఐ గవర్నర్‌గా కొనసాగే వారని ఆయన తండ్రి, భారత మాజీ బ్యూరోక్రట్ ఆర్. గోవిందరాజన్ ఓ మీడియాకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ఓ తండ్రిగా తన కొడుకు పక్షాన తాను మాట్లాడకూడదుగానీ, ఇప్పుడు ఈ అంశం వివాదాస్పదమైనందున, ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించినందున తాను మాట్లాడాల్సి వస్తోందని ఆయన అన్నారు.

రఘురామ్ రాజన్ దేశభక్తిని బీజేపీ నాయకుడు సుబ్రమణియం స్వామి శంకించడం, ఆయనపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం, ఆయన్ని తక్షణం ఆర్‌బీఐ గవర్నర్ పదవి నుంచి తప్పించాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరడం తదితర పరిణామాలకు రాజన్ నొచ్చుకున్నారు. మరోమారు తాను గవర్నర్ పదవిని చేపట్టనంటూ కూడా ఖరాకండిగా చెప్పారు. ఆయనపై రెండు నెలల క్రితమే దుష్ర్పచారం మొదలైందని, అప్పుడే గనుక ప్రభుత్వం స్పందించి ఉన్నట్లయితే కచ్చితంగా తన కొడుకు మరో పర్యాయం ఆర్‌బీఐ గవర్నర్‌గా కొనసాగేవారని భారత సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారిగా రిటైర్ అయిన గోవందరాజన్ వ్యాఖ్యానించారు.

సుబ్రమణియం స్వామి, రాజన్‌పై విమర్శలు చేస్తున్నంతకాలంలో మౌనం వహించిన నరేంద్ర మోదీ, చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మూడు రోజుల క్రితం ఇచ్చిన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రాజన్‌పై వచ్చిన విమర్శలను ఖండించిన విషయం తెల్సిందే. అదికూడా రాజన్ పేరును నేరుగా ప్రస్థావించకుండానే ఆయనపై ఎవరు ఇలాంటి విమర్శలు చేయడం సముచితం కాదని ఆ ఇంటర్వ్యూలో మోదీ వ్యాఖ్యానించారు.

గోవిందరాజన్ భార్య మైథిలి కూడా రాజన్‌పై జరిగిన విషప్రచారాన్ని ఖండించారు. ముఖ్యంగా తన కుమారుడి దేశభక్తిని శంకించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్‌లోనే పుట్టి, భారత్‌లోనే ఐఐటీ చదువుకొని, భారత్‌కే సేవలందిస్తున్న నా కుమారుడి దేశభక్తిని శంకిస్తారా అంటూ ఆమె ప్రశ్నించారు.

‘ఈ విషయంలో నా కుమారుడు ఏమనుకున్నాసరే, నేను మాత్రం నా అభిప్రాయాలను స్పష్టంగా చెబుతాను. నేను మావారి ఉద్యోగం రీత్యా లండన్‌లో ఉన్నప్పుడు నా కుమారుడు భారత్‌లోనే ఉన్నారు అవసరం అనుకుంటే లండన్‌లోనే చదువుకునే అవకాశం కూడా నా కుమారుడికి ఉంది. 1984లో సిక్కులకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్ల సందర్భంలో కూడా రాజన్ ఢిల్లీలోనే ఉండి వీలైనంత మంది సిక్కులకు ఆశ్రయం ఇచ్చారు. ఐఐటీలో విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేసిన రాజన్ అది తన బాధ్యతని భావించి ఉండవచ్చు. ఐఐటీ కాలేజ్ సురక్షిత ప్రాంతం కావడం వల్ల కూడా అల్లర్ల నుంచి ఎంతోమంది సిక్కులను రక్షించి ఆశ్రయం కల్పించారు. అలాంటి వ్యక్తిపై నిందలు వేయడం తగదు’ అని కూడా ఆమె అన్నారు.
 

మరిన్ని వార్తలు