ఇదో సాఫ్ట్‌‘వేరే’ స్టోరీ!

13 Feb, 2014 08:36 IST|Sakshi
ఇదో సాఫ్ట్‌‘వేరే’ స్టోరీ!

*యువతి వేధింపులకు యువకుడి బలి
* అబ్బాయిది పుణే... అమ్మాయిది సిటీ
* పెళ్లి చేసుకోమని ‘బెదిరించడమే’ కారణం
* కేసు నమోదు చేసుకున్న యరవాడ కాప్స్

సాక్షి, సిటీబ్యూరో: ప్రేమ పేరుతో, పెళ్లి చేసుకోమంటూ యువకుల నుంచి ఎదురయ్యే వేధింపులు భరించలేక ఆత్మహత్యలకు పాల్పడిన యువతుల వార్తలు తరచుగానే చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. పెళ్లి చేసుకోమంటూ ఓ యువతి చేసిన వేధింపులకు యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లే. ఈ ఉదంతం మహారాష్ట్రలోని పుణేలో ఉన్న యరవాడలో చోటు చేసుకుంది. యువతిది హైదరాబాద్‌గా తేలింది. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి స్థాయిలో నిర్ధారణ అయితే తప్ప యువతి పేరు, ఇతర వివరాలు వెల్లడించమని యరవాడ ఠాణా సీనియర్ ఇన్‌స్పెక్టర్ కిషోర్ జాదవ్ ‘సాక్షి’కి బుధవారం ఫోన్‌లో చెప్పారు.


 కాలేజీలో ఏర్పడిన పరిచయంతో...
 హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న నగరానికే చెందిన ఓ యువతి గతంలో పుణేలో ఇంజనీరింగ్ కాలేజీలో చదివారు. ఈ నేపథ్యంలోనే అక్కడి కళ్యాణినగర్‌కు చెందిన రోహిత్ కపూర్ కుమారుడు సిద్ధాంత్ రోహిత్ కపూర్‌తో పరిచయం ఏర్పడింది. అతడు పుణేలోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేసేవాడు. కాలేజీలో ఏర్పడిన వీరి పరిచయం ఆ తర్వాత కూడా కొనసాగడంతో ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇటీవల సదరు యువతికి సిద్ధాంత్‌తో ఫోన్‌లో మాట్లాడుతున్న ప్రతి సందర్భంలోనూ తనను వివాహం చేసుకోమంటూ వేధించడం ప్రారంభించింది.


  ఉరి వేసుకుని...
 తనకు వివాహం చేసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓసారి... మోసం చేశావంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ మరోసారి యువతి నుంచి సిద్ధాంత్‌కు వేధింపులు ఎక్కువయ్యాయి. సోమవారం కూడా ఈ విషయంపై ఇద్దరికీ ఫోనులో గొడవ జరిగింది. దీంతో విసిగివేసారి పోయిన అతడు సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గది పై భాగంలో ఉన్న కబోర్డ్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి 10.45 సమయంలో మరోసారి యువతి ఫోన్ చేయగా సిద్ధాంత్ నుంచి స్పందన లేదు. దీంతో కంగారుపడిన ఆమె అతడి పక్క ఫ్లాట్‌లో ఉండే వారికి కాల్ చేసి ఈ విషయం చెప్పారు.


 గొడవ పడ్డామని అంగీకరించి...
 సిద్ధాంత్ ఇంటి పక్క వారికి కాల్ చేసిన యువతి తమ మధ్య ఫోనులో గొడవ జరిగిందని, ఇప్పుడు ఫోన్ చేస్తే ఎత్తట్లేదని చెప్పింది. తక్షణం వెళ్లి అతడి ఫ్లాట్ తలుపు కొట్టాలని, స్పందన లేకుంటే పగలకొట్టైనా లోపలికి వెళ్లి చూడాలని కోరింది. దీంతో బలవంతంగా సిద్ధాంత్ ఫ్లాట్‌లోకి ప్రవేశించిన చుట్టుపక్కల యువత అతడు ఉరివేసుకున్నట్లు గుర్తించారు.

సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఉదంతంపై సిద్ధాంత్ తండ్రి రోహిత్ కపూర్ యరవాడ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన కుమారుడి మృతికి హైదరాబాద్‌కు చెందిన యువతి కారణమని పేర్కొన్నారు. ఈ మేరకు యువతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమెను పుణేకు పిలిపించి విచారించాలని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు