ఈ ప్రశ్నలకు బదులివ్వండి

26 Apr, 2014 22:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీపై బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. గుజరాత్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అదంతా బీజేపీ నాయకులు చేసుకుంటున్న ప్రచారమంటూ ప్రియాంక గాంధీ చేసిన విమర్శలకు బీజేపీ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రియాంకగాంధీకి బీజేపీ ఢిల్లీశాఖ అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్ పది ప్రశ్నలు సంధించారు. గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపై విమర్శలు చేస్తున్న ప్రియాంక గాంధీ తన భర్తపై వచ్చిన ఆరోపణలకు ఏం సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హర్షవర్ధన్ పలు అంశాలపై మాట్లాడారు. ప్రియాంక గాంధీ ముందు తాను అడిగే పది ప్రశ్నలకు 48 గ ంటల్లో  సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.  హర్షవర్ధన్ అడిగిన ప్రశ్నలు..
 
 నరేంద్రమోడీ గుజరాత్‌ను అభివృద్ధి చేయకపోతే అక్కడి ప్రజలు వరుసగా మూడు సార్లు ఆయనను ముఖ్యమంత్రిగా ఎందుకు ఎన్నుకున్నారు? నరేంద్రమోడీ అభివృధ్ధి మోడల్‌పై వ్యాఖ్యలతో ఆరు కోట్ల మంది గుజరాతీయులను అవమానించినట్టు కాదా?
 మీ భర్త రాబర్ట్ వాద్రా హర్యానా, రాజస్థాన్‌లో భూ ఆక్రమణలకు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి దీనికి మీ సమాధానం?
 రాత్రికి రాత్రే ఆయన లక్షాధికారి నుంచి కోటీశ్వరుడు ఎలా అయ్యారో ప్రజలకు వివరించగలరా?
 రాబర్ట్ వాద్రా భూ కుంభకోణాలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 23న విచారణకు అనుమతించింది. గతంలో ఇలాంటి పిటిషన్లు ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించలేదు. ప్రత్యేకించి రాబర్ట్‌వాద్రా కేసును స్వీకరించడంపై మీ స్పందన ఏమిటి?
 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తరఫున మీరు ప్రచారం చేస్తున్న రాయ్‌బరేలీ నియోజకవర్గ ప్రజలకు ఇప్పటికీ కనీస సదుపాయాలు లేవు. ఇక్కడ ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీనే గెలుస్తోంది. పదేళ్లుగా కేంద్రంలో కాంగ్రెస్ సర్కారే ఉంది. అయినా స్థానికులకు సోనియాగాంధీ కనీస సదుపాయాలు ఎందుకు సమకూర్చలేకపోయారు?
 పదేళ్లుగా మన్మోహన్‌సింగ్‌ను ప్రధాని పదవిలో కూర్చోబెట్టి తెర వెనుక అధికారం అంతా సోనియాగాంధీ చలాయిస్తున్నారని ప్రధానమంత్రి మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్‌బారు ఇటీవల తన పుస్తకంలో ఆరోపించారు. దీనిపై మీరు దేశ ప్రజలకు ఇచ్చే సమాధానం ఏమిటి?
 గోద్రా అల్లర్లపై నరేంద్రమోడీకి కోర్టులు క్లీన్‌చిట్ ఇచ్చినా, కాంగ్రెస్ నాయకులు పదేపదే అవే ఆరోపణలు ఎందుకు  చేస్తున్నారు?
 కాంగ్రెస్ నాయకులు లేవనెత్తేందుకు అంశాల కొరత ఏర్పడిందా?
 రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని కొన్ని రోజుల క్రితం మీడియాకు చెప్పిన మీరు, సోదరుడు రాహుల్ తరఫున ప్రచారం చేయడంలో ఆంతర్యం ఏంటి?
     గుజరాత్ అభివృద్ధి మోడల్‌గా దేశప్రజలంతా హర్షిస్తున్నారు. అభివృద్ధి జరగలేదని మీరు ఎందుకు నిరూపించలేకపోతున్నారు?
 

>
మరిన్ని వార్తలు