19లోగా సంజాయిషీ ఇవ్వండి!

14 Apr, 2018 07:26 IST|Sakshi
అమృత

జయ వారసురాలి కేసు..

హైకోర్టు ఉత్తర్వులు

టీ.నగర్‌: జయలలిత కుమార్తెనంటూ దాఖలైన పిటిషన్‌కు ఈనెల 19లోగా సంజాయిషీ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనంటూ కర్ణాటకకు చెందిన అమృత ఇటీవల మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అందులో జయలలిత పార్థివదేహాన్ని వైష్ణవ అయ్యంగార్‌ బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం ఖననం చేయలేదని,  దీంతో ఆమె మృతదేహాన్ని వెలికితీసి బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం ఖననం చేసేందుకు తనకు అనుమతినిచ్చేలా కార్పొరేషన్‌ కమిషనర్‌కు ఉత్తర్వులివ్వాలని కోరారు. ఇందుకు తగిన భద్రత కల్పించేందుకు నగర కమిషనర్‌కు ఉత్తర్వులివ్వాలని, అంతేకాకుండా తాను జయ వారసురాలినని నిరూపించేందుకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహణకు ఉత్తర్వులివ్వాలని కోరారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీవ్ర వ్యతిరేకత తెలిపారు. అమృత జయ వారసురాలిగా పేర్కొనడానికి ఎలాంటి చట్టబద్ధమైన ఆధారాలు లేవని, అందువల్ల ఈ కేసు తోసిపుచ్చాలని అడ్వకేట్‌ జనరల్‌ విజయనారాయణ్‌ వాదించారు.

అంతేకాకుండా అమృతపై పోలీసు విచారణ జరుగుతున్నట్లు తెలిపారు. ఇలాఉండగా ఈ కేసుపై న్యాయమూర్తి ఎస్‌ వైద్యనాథన్‌ మాట్లాడుతూ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సమయంలో జయ రక్త శాంపిల్స్‌ సేకరించారా? ఈ శాంపిల్స్‌ ఆస్పత్రి యాజమాన్యం వద్ద ఉన్నాయా? అని ప్రశ్నించారు.  ఈ పిటిషన్‌ శుక్రవారం న్యాయమూర్తి ఎస్‌.వైద్యనాథన్‌ సమక్షంలో మళ్లీ విచారణకు వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వం తరఫున జనవరిలోనే సంజాయిషీ ఇవ్వడానికి హైకోర్టు ఉత్తర్వులిచ్చినా ఇంతవరకు దాఖలు చేయలేదని పిటిషనర్‌ తరఫున హాజరైన న్యాయవాది ప్రకాష్‌ వాదించారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది బదులిస్తూ ఈ కేసులో అడ్వకేట్‌ జనరల్‌ హాజరవుతున్నారని, ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లినందున శుక్రవారం హాజరుకాలేదని వెల్లడించారు. దీంతో విచారణ వాయిదా వేయాలని కోరారు. దీంతో ఈ కేసు విచారణను ఏప్రిల్‌ 19కి వాయిదా వేసిన న్యాయమూర్తి, ఈ లోపు రాష్ట్ర ప్రభుత్వం సంజాయిషీ పిటిషన్‌ దాఖలు చేయాలని ఉత్తర్వులిచ్చారు. 

మరిన్ని వార్తలు