‘శివాజీ’ విగ్రహాన్ని తొలగించండి

24 Jan, 2014 00:51 IST|Sakshi
 సాక్షి, చెన్నై:తమిళ సినీలోకానికి ఎంజీయార్, నడిగర్ తిలగం శివాజీ గణేశన్ రెండు కళ్లు లాంటి వారు. వీరు ఇప్పుడు మన మధ్య లేరు. అయితే, వారి జ్ఞాపకాలు వెండి తెర వెలుగుల రూపంలో దర్శనం ఇస్తున్నాయి. వీరిని గౌరవిస్తూ ప్రభుత్వాలు ముందుకె ళుతున్నాయి. ఆ దిశగా తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో అత్యంత జన సంచారంతో నిండిన ప్రదేశం మెరీనా తీరంలో నడిగర్ తిలగంకు 2006లో డీఎంకే ప్రభుత్వం విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఆ  తీరంలోని కామరాజర్ రోడ్డులో నడిగర్ తిలగం నట ఖ్యాతిని, అభిమానాన్ని, గౌరవాన్ని చాటే విధంగా గాంభీర్యంగా ఈ విగ్రహం దర్శనం ఇస్తుంటుంది. అయితే, ఈ విగ్రహం మరి కొద్ది రోజుల్లో అక్కడి నుంచి కదలబోతున్నది. ఇందుకు కారణం ఆ విగ్రహానికి వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన పిటిషన్.
 
 వ్యతిరేకత: ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహం, అన్నాడీఎంకే సర్కారు అధికార పగ్గాలు చేపట్టిన కొన్ని నెలల్లో వార్తల్లోకి ఎక్కింది. నిలువెత్తు విగ్రహం కారణంగా ఆ మార్గంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్న ఓ వ్యక్తి పిటిషన్ వివాదానికి దారి తీసింది. ఈ పిటిషన్‌కు వ్యతిరేకత బయలు దేరింది. విగ్రహాన్ని తొలగించొద్దంటూ సినీ ప్రముఖులు కమిషనరేట్‌ను ఆశ్రయించారు. చివరకు బంతిని రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోకి నెట్టే రీతిలో మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అగర్వాల్, న్యాయమూర్తి సత్యనారాయణన్ నేతృత్వంలోని బెంచ్ వ్యవహరించింది. పోలీసులను వివరణ కోరగా, ఆ విగ్రహానికి వ్యతిరేకంగానే రిట్ పిటిషన్  దాఖలు చేశారు. ఆ విగ్రహాన్ని తొలగించాల్సిందేనని, ఇందుకు అనుమతి ఇవ్వాలంటూ బెంచ్‌కు పోలీసులు చేసుకున్న విన్నపం వివాదానికి మరింతగా ఆజ్యం పోసినట్టు అయింది. అరుుతే ఈ పిటిషన్‌ను తాము విచారించబోమంటూ ఆ బెంచ్ చేతులు ఎత్తేసింది. అదే సమయంలో విగ్రహం తొలగింపునకు జరుగుతున్న కుట్రలపై రాజకీయ పక్షాలు కదిలాయి. తమ గళాన్ని గట్టిగా వినిపించాయి. ఆ విగ్రహాన్ని తొలగించొద్దంటూ డిమాండ్ చేశాయి. అయితే, ఫలితం శూన్యం. 
 
 తొలగించాల్సిందే: చివరకు శివాజీ  విగ్రహం వ్యవహారానికి సంబంధించిన పిటిషన్ల విచారణలన్నీ  న్యాయమూర్తి అగ్ని హోత్రి, కేకే శశిధర్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు చేరాయి. విచారణను ముగించిన ఈ బెంచ్ గురువారం తీర్పును వెలువరించింది. విగ్రహం అదే చోట ఉంచుతారా..? లేదా తొలగిస్తారా..? అన్న ఉత్కంఠతో శివాజీ అభిమానులు ఎదురు చూశారు. అయితే, కోర్టు ఇచ్చిన తీర్పు నిరాశలో ముంచింది. ఆ విగ్రహాన్ని తొలగించాలని, ఇందుకు తగ్గ చర్యలు తీసుకోవచ్చని ఆ బెంచ్ ఆదేశించింది. ఈ విగ్రహం వ్యవహారంపై తాము పలు కోణాల్లో పరిశీలనలు జరిపినట్టు వివరించింది. పోలీసుల వాదనలు విన్నాం, నివేదికలు పరిశీలించామని పేర్కొన్నారు. ఈ విగ్రహం కారణంగా ఆ మార్గంలో ప్రమాదాలు జరుగుతున్నట్టు స్పష్టం కావడంతో ఇక, అక్కడి నుంచి మరో చోటకు మార్చుకోవచ్చంటూ బెంచ్ ఇచ్చిన తీర్పు శివాజీ అభిమానులను డైలమాలో పడేసింది.ఎంజీయార్ విగ్రహానికి అవమానం: తమ అభిమాన కథానాయకుడి విగ్రహాన్ని తొలగిస్తారా..? అంటూ ఏకంగా తిరునల్వేలిలో అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు దివంగత ఎంజీయార్ విగ్రహానికి అవమాన పరిచే రీతిలో చెప్పుల మాల వేశారు. దీనికి కారణమైన శివాజీ అభిమాని ముత్తుకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పలు చోట్ల అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడంతో పాటుగా, అప్పీలుకు వెళ్లేందుకు కసరత్తుల్లో ఉన్నారు. ఇక, కోర్టు తీర్పుతో ఆ విగ్రహాన్ని ఆగమేఘాలపై మరో చోటకు మార్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తులు చేస్తోంది.
 
 
మరిన్ని వార్తలు