ఆయన అలా మాట్లాడటం సరికాదు

21 Apr, 2016 01:36 IST|Sakshi

బెంగళూరు: కరువు పరిస్థితులు పెద్దగా లేవని కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సహాయం అక్కరలేదని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న సిద్ధరామయ్య పేర్కొనడం సరికాదని భారతీయ జనతా పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు విషయంలో కూడా రాజకీయాలు చేయడం వల్ల ప్రజలు ఇబ్బందుల పాలవుతారని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో ఎప్పుడూ లేనంతగా కరువు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.


ఇక్కడ కరువు పరిస్థితులను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిపుణులను కర్ణాటకకు పంపించి క్షేత్రస్థాయి అధ్యయనం జరిపించిందన్నారు. అధికారుల నివేదికను అనుసరించి గతంలో ఏ ప్రభుత్వం మంజూరు చేయని నిధులను కరువు నివారణ పనుల నిమిత్తం రాష్ట్రానికి కేటాయించిందని యడ్యూరప్ప ఈ సందర్భంగా గుర్తుచేశారు. కరువు ఉందనే ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఉత్తర కర్ణాటక ప్రాంతంలో పర్యటించలేదా? అని యడ్డీ ప్రశ్నించారు. కరువు పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంతో నివారణ పనుల కోసం  తమ పార్టీకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతాన్ని  ప్రభుత్వానికి  అందజేయనున్నామన్నారు.

 

మరిన్ని వార్తలు