ప్రియ తనయుడు

10 May, 2016 04:11 IST|Sakshi
కరుణతో స్టాలిన్

* నా బిడ్డగా పుట్టడం పుణ్యఫలం
* తనయుడికి తండ్రి కితాబు
* నిరాడంబర జీవితం సాగిస్తున్నారన్న స్టాలిన్
* పరస్పరం పొగడ్తల పన్నీరు
* ఒకరి కోసం మరొకరి ఓట్ల వేట

సాక్షి, చెన్నై: తండ్రి కోసం తనయుడు, తనయుడి కోసం తండ్రి ఓట్ల వేటలో పడ్డారు. స్టాలిన్ తనకు ప్రియ పుత్రుడని, అతడు బిడ్డగా పుట్టడం పుణ్యఫలమని డీఎంకే అధినేత కరుణానిధి వ్యాఖ్యానించారు.

ఉన్న ఇంటిని కూడా ఆసుపత్రికి ఇచ్చేసి కరుణానిధి నిరాడంబర జీవితాన్ని సాగిస్తున్నారని డీఎంకే దళపతి స్టాలిన్ ప్రశంసించారు. తిరువారూర్ ఎన్నికల బరిలో డీఎంకే అధినేత ఎం.కరుణానిధి, చెన్నై కొళత్తూరు రేసులో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ పోటీ చేస్తున్నారు. తండ్రి కోసం తనయుడు, తనయుడి కోసం తండ్రి ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పర్యటన సాగిస్తున్న ఎంకే స్టాలిన్ సోమవారం కరుణానిధి పోటీ చేస్తున్న తిరువారూర్‌లో పర్యటించారు.

అక్కడి ప్రచార సభలో స్టాలిన్ మాట్లాడుతూ తన తండ్రి, పార్టీ అధినేత కరుణానిధి ఇక్కడి వారే అని గుర్తు చేశారు. తిరువారూర్‌తో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసి, ఉన్న ఇంటిని కూడా ఆసుపత్రికి ఇచ్చిన ఘనత కరుణానిధికే దక్కుతుందని వ్యాఖ్యానించారు.  కుటుంబం నుంచి తన తర్వాత ఎవరూ వారసత్వ రాజకీయాల్లోకి రారని స్పష్టం చేశారు.
 
ప్రియ పుత్రుడు: స్టాలిన్ కొళత్తూరు నుంచి పోటీ చేస్తున్నారని, ఆయన తరఫున డీఎంకే అధినేత కరుణానిధి ప్రజల్ని ఉద్ధేశించి ప్రసంగించారు. స్టాలిన్ పార్టీ కోసం తనను అర్పించుకున్నాడని, రేయింబవళ్లు శ్రమిస్తున్నాడని పేర్కొన్నారు. స్టాలిన్‌ను చూస్తుంటే కొన్ని సమయాల్లో తనకు ఈర్ష్య కలుగుతోందని వ్యాఖ్యానించారు. తాను చిన్నతనం నుంచే పార్టీ కోసం శ్రమిస్తున్నానని, తాను పడ్డ శ్రమలో వంద రేట్లు ఎక్కువగా స్టాలిన్ పడుతున్నాడని పేర్కొన్నారు. స్టాలిన్ తనకు ప్రియ పుత్రుడని, అతడు కొడుకుగా పుట్టడం పుణ్యఫలమని వ్యాఖ్యానించారు. అందరూ స్టాలిన్‌ను ఆదరించాలని విన్నవించుకున్నారు.

మరిన్ని వార్తలు