నేను క్షేమమే..

12 Dec, 2015 08:29 IST|Sakshi
నేను క్షేమమే..

ఆందోళన వద్దు
విజయ్‌కాంత్ ఆరోగ్యంపై వివరణ
  పుకార్లపై డీఎండీకే ఆగ్రహం
  వరద సహాయక చర్యల్లో బిజీ బిజీ

 
 సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్ ఆరోగ్యంపై పుకార్లు బయలు దేరాయి. ఆయన ఆస్పత్రిలో చేరినట్టు, పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా వచ్చిన సమాచారం పుకార్లేనని డీఎండీకే కార్యాలయం స్పష్టం చేసింది. విజయకాంత్ క్షేమంగా ఉన్నారని, వరద సహాయకాల్ని బాధితులకు దరి చేర్చడంలో బిజీగా ఉన్నారని వివరించింది. డీఎండీకే అధినేత విజయకాంత్ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల కాలంగా ఆరోపణలు బయలుదేరుతున్నాయి.  ఈ ఏడాది  ఆరంభంలో ఆయన అనారోగ్యం బారిన పడ్డట్టుగా ప్రచారం బయలు దేరింది.
 
 అయితే, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేసినా, చివరకు సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స జరిగి ఉండటం వెలుగులోకి వచ్చింది. చివరకు ఆయనకు కిడ్నీల మార్పిడి శస్త్ర చికిత్స జరిగినట్టు తేలింది. ఆ శస్త్ర చికిత్స తదుపరి విజయకాంత్ సన్నబడ్డారు. కొన్నాళ్లు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉన్నా, చివరకు మళ్లీ తన రాజకీయ వ్యూహాల మీద దృష్టి పెట్టారు. ఈశాన్య రుతు పవనాలు కడలూరు మీద ప్రభావం చూపించినప్పటి నుంచి అవిశ్రాంతంగా ఆయన ప్రజల్లోనే ఉన్నారని చెప్పవచ్చు. కడలూరులో గ్రామ గ్రామంలో తిరిగారు.
 
  ప్రజలకు భరోసా ఇస్తూ, సహాయకాల పంపిణీ సాగించారు. చెన్నైలో ఒకటి రెండు చోట్లకు వెళ్లినా, చివరకు పార్టీ కార్యాలయం నుంచి సహాయకాల పంపిణీ మీద దృష్టి పెట్టారని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో విజయకాంత్ తీవ్ర అనారోగ్యం బారిన పడ్డట్టుగా, ఓ ఆసుపత్రిలో ఆయనకు చికిత్సలు అందిస్తున్నట్టుగా గురువారం వచ్చిన సమాచారంతో డీఎండీకే వర్గాల్లో ఆందోళన పెరిగింది. తమ నేతకు ఏమైందో తెలుసుకునేందుకు మీడియా కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఇదే విషయంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయాల్ని మీడియా వర్గాలు సంప్రదించడంతో ఆరోగ్య పుకార్లు దావానంలా వ్యాపించాయి. విజయకాాంత్‌కు ఏమైందోనన్న ఉత్కంఠ బయలు దేరింది. అయితే, అవన్నీ పుకార్లుగా తేల్చుతూ శుక్రవారం ఆ పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే, వరద సాయంపై విజయకాంత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా మరో ప్రకటనను వెలువరించింది.
 
 క్షేమమే : పార్టీ అధినేత విజయకాంత్ క్షేమంగా ఉన్నారని, పుకార్లు, ప్రచారాల్ని నమ్మవద్దంటూ ఆ పార్టీ కార్యాలయం స్పష్టం చేసింది. విజయకాంత్ అవిశ్రాంతంగా ప్రజల కోసం శ్రమిస్తున్నారని, ప్రతిరోజూ ఉదయం పదిన్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటలకు కార్యాలయంలోనే ఉంటూ, వరద బాధిత ప్రాంతాలకు సహాయకాలను తరలించే పనుల్ని పర్యవేక్షిస్తున్నట్టుగా వివ రించారు. పేదల ముఖాల్లో చిరునవ్వే తన జీవితానికి ఆనందం అని పదే పదే చెప్పుకునే విజయకాంత్‌కు ఎలాంటి హాని జరగదని, ఆయన క్షేమంగానే ఉన్నారన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు.
 
  పేదల సేవే పరమాత్ముడి సేవగా భావించి వరద సహాయక చర్యల్లో ముమ్మరంగా సాగుతున్న విజయకాంత్ ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన పుకార్లను తీవ్రంగా ఖండిస్తున్నామని  ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయకాంత్ విడుదల చేసినట్టుగా మరో ప్రకటనలో, వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రజలు వరదల్లో కోల్పోయిన గృహోపకరణాలను ప్రభుత్వమే అందించాలని డిమాండ్ చేశారు.
 

>
మరిన్ని వార్తలు