ఉత్కంఠగా గుండె మార్పిడి

17 Jun, 2014 01:10 IST|Sakshi
ఉత్కంఠగా గుండె మార్పిడి

 సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలో సోమవారం సాయంత్రం కాసేపు ఉత్కంఠ భరిత వాతావరణం నెల కొంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తమ బిడ్డ హృదయాన్ని ఓ దంపతులు దానం చేశారు. మరో యువతికి దాన్ని అమర్చడం లక్ష్యంగా అంబులెన్స్‌లో బయలుదేరిన ఆ హృదయం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానాన్ని 13 నిమిషాల్లో చేరింది. అవయవదానాల మీద ఇటీవల రాష్ట్రంలో అవగాహన పెరుగుతోంది. ప్రమాదం బారిన పడ్డ తమ వారి అవయవాలను మరొకరికి దానం చేస్తున్న కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. ఆ కోవలో కాంచీపురం జిల్లా మదురాం తకం సమీపంలో ఈనెల 11న జరిగిన రోడ్డు ప్రమాదంలో లోకనాథన్(27)గాయపడ్డారు. తలకు బలమైన గాయం తగలడంతో కోమాలోకి వెళ్లాడు. చెన్నై రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న తమ బిడ్డ బతకడం అనుమానం కావడంతో అతడి అవయవాలను దానం చేయడానికి తల్లిదండ్రులు యోగీశ్వర న్, రాజ్యలక్ష్మి నిర్ణయించారు. అదే సమయంలో అడయార్‌లోని ఓ ఆస్పత్రిలో హృదయ మార్పిడి కోసం ముంబైకు చెందిన ఓ యువతి హోబి(21) ఎదురు చూస్తుండడంతో లోకనాథన్ హృదయా న్ని ఆమెకు ఇచ్చేందుకు నిర్ణయించారు.
 
 ఉత్కంఠ:
 సోమవారం సాయంత్రం లోకనాథన్ శరీరానికి పోస్టుమార్టం ఆరంభం అయింది. అతడి అవయవాలను బయటకు తీసి ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచారు. అతడి హృదయాన్ని అడయార్‌లోని మలర్ ఆస్పత్రిలో ఉన్న ఆ యువతికి అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు. హృదయాన్ని సకాలంలో ఆ ఆస్పత్రికి చేర్చడం లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సెంట్రల్ సమీపంలోని జీహెచ్ నుంచి ఎంఎంసీ, మెరీనా తీరం మీదుగా పట్టిన వాక్కం, ఎంఆర్ సీ నగర్ సిగ్నల్ గుండా అడయార్‌లోని ఆస్పత్రికి తరలించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఆ మార్గాల్లో ఆగమేఘాలపై ట్రాఫిక్ మార్పులు చేశారు. పది నిమిషాల్లో ఆ హృదయాన్ని అడయార్‌కు తరలించే విధంగా రెడీ అయ్యారు.
 
 జీహెచ్ నుంచి లోకనాథన్ హృదయం తో అంబులెన్స్ బయలుదేరేందుకు పది నిమిషాల ముందుగా ఆ మార్గాల్లో ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడ నిలిపి వేశారు. సినీ ఫక్కీలో తీవ్ర ఉత్కంఠ నడుమ సరిగ్గా పదమూడు నిమిషాల్లో అడయా ర్ ఆస్పత్రికి ఆ హృదయాన్ని చేర్చారు. అప్పటికే హోబీకి శస్త్ర చికిత్స ఏర్పాట్లు చేసి ఉండడంతో, హృదయం రాగానే ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. ఇద్ద రు సీనియర్ శస్త్ర చికిత్సా నిపుణుల పర్యవేక్షణలో హోబీకి లోకనాథన్ గుండెను అమర్చే హృదయ మార్పిడి శస్త్ర చికిత్స జరుగుతోంది.   ఈ శస్త్ర చికిత్స విజయవంతం కావాలన్న కాంక్షతో సర్వత్రా ఎదురు చూస్తున్నారు.
 

మరిన్ని వార్తలు