కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

12 Dec, 2016 14:28 IST|Sakshi
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన

హైదరాబాద్‌:  వార్దా తుఫాను నెల్లూరుకు ఆగ్నేయ దిశలో 820 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 20 కిలో మీటర్ల వేగంతో నెల్లూరు వైపు పయనిస్తోంది. దీని ప్రభావం వల్ల ఆదివారం కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా వార్దా తుఫాను కదులుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపటి వరకు తీవ్ర తుఫానుగానే కొనసాగనుంది. ఏపీ తీరానికి చేరుకునే సరికి వార్దా తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశముంది. సోమవారం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటనుంది. ఇదిలావుండగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు వెళ్లాల్సిన యూఏఈ, కువైట్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. వార్దా తుఫాను వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో చంద్రబాబు సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు.