దుర్గమ్మ దర్శనానికి ఎన్ని అగచాట్లో

2 Oct, 2016 08:29 IST|Sakshi
 • భక్తులకు కిలోమీటర్ల కొద్దీ నడక
 • అంతరాలయం దర్శనం బంద్‌పై ఆగ్రహం
 • వీఐపీలు, పోలీసులకే ‘లిఫ్టు’ సేవలు
 •  
  విజయవాడ:  దసరామహోత్సవాల్లో తొలిరోజు అమ్మవారి దర్శనానికి ఇబ్బందులు తప్పలేదు. కొత్తగా చేసిన మార్పులు, అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమనే విమర్శలున్నాయి. రూ.500 టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తుల్ని మాత్రమే పున్నమి ఘాట్ నుంచి ప్రత్యేక వాహనాల్లో కొండపైకి అనుమతించారు. వృద్దులు, వికలాంగులకు తూతూ మంత్రంగానే వాహనాలను ఏర్పాటు చేశారు. దీంతో సుమారు ఐదు కి.మీ నడవడానికి భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు.
   
  అంతరాలయ దర్శనం నిల్
  ఉదయం భక్తులు రద్దీ నామమాత్రంగా వున్నప్పటీకీ దేవస్థానం అధికారులు అంతరాలయ దర్శనం రద్దు చేసి కేవలం ముఖమండప దర్శనం మాత్రమే అనుమతిచ్చారు. ఇది భక్తులకు చెప్పకుండా రూ.500, రూ.300 టిక్కెట్లు విక్రయించారు. విషయం తెలిసి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ముందుగా చెప్పకుండా రూ.500 టిక్కెట్లు అంటగడుతున్నారంటూ సెక్యూరిటీ సిబ్బందిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
   
  కుంకుమార్చనకు భక్తుల కొరత
  తొలిరోజున అతి తక్కువగా తొలి బ్యాచ్‌లో 70 మంది రెండవ బ్యాచ్ 9 మంది కలిపి 79 మంది మాత్రమే కుంకుమార్చన చేసుకున్నారు. ఇక శత చండీయాగానికి కేవలం ఆరుగురు భక్తులు మాత్రమే వచ్చారు. లాభార్జన కోసం కుంకుమార్చన టిక్కెట్లు ఇబ్బడి ముబ్బడిగా పెంచేయడంతో భక్తులు రావట్లేదనే ఆరోపణలున్నాయి.
   
  లిప్టులోకి భక్తులకు నో ఎంట్రీ
  మల్లికార్జున మహామండపంలోని లిప్టులలో సాధారణ భక్తుల్ని అనుమతించడం లేదు. కేవలం దేవస్థానం సిబ్బందితో పాటు వీవీఐపీలు, పోలీసులు మాత్రమే వెళ్తున్నారు. సాధారణ భక్తుల్ని అర్జున వీధిలోంచి కొండ పైకి రానివ్వడం లేదు.
   
  పాలకమండలి సభ్యుల పరిశీలన
  మంత్రి దేవినేని ఉమా, దేవస్థానం పాలకమండలి చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు, సభ్యులు గుణశేఖర్, వెలగపూడి శంకరబాబు, కోడేల సూర్యకుమారి తదితరులు వచ్చారు. భక్తుల ఇబ్బందులను ఈవో ఎ.సూర్యకుమారి దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించగా ఆమె అందుబాటులో లేరు.

మరిన్ని వార్తలు