నివురుగప్పిన నిప్పు

18 Oct, 2016 03:00 IST|Sakshi
నివురుగప్పిన నిప్పు

బెంగళూరు (బనశంకరి) :  ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త రుద్రేశ్ హత్యతో బెంగళూరులో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నగర బీజేపీ నేతలు, ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్ పరివార్ కార్యకర్తలు సోమవారం శివాజీనగరలో ధర్నా చేపట్టారు. ధర్నాలో మాజీ డిప్యూటీ సీఎం అశోక్, మాజీ మంత్రులు సురేశ్‌కుమార్, శోభాకరంద్లాజే, కట్టాసుబ్రమణ్యం నాయుడు, ఎంపీలు పీసీ.మోహన్, బీ.శ్రీరాములు, సోమవారం శివాజీనగర బీఎంటీసీ బస్టాండు వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా ప్రాంతానికి చేరుకున్న పోలీస్ కమిషనర్ మేఘరిక్ రుద్రేశ్ హంతకులను వెంటనే అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనలో 30 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నామని ప్రత్యక్ష సాక్షులు, స్నేహితుల నుంచి సమాచారం సేకరిస్తున్నామన్నారు. ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయన్నారు. రుద్రేశ్ హత్య ఓ పథకం ప్రకారం జరిగిందని మేఘరిక్ చెప్పారు. ఈ హత్యతో శివాజీనగర చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో రుద్రేశ్ అంత్యక్రియలు ముగిసేవరకు నిషేధాజ్ఞలు విధించారు. శివాజీన గర బస్టాండుకు వెళ్లే వాహనాల సంచారాన్ని నిలిపివేశారు. రిజర్వుపోలీస్ బలగాలతో పాటు అదనపు పోలీసులను నియమించారు. శివాజీనగర ప్రాంతాల్లో బంద్ వాతావరణం కనిపించింది. దుకాణాలన్నీ ముసివేశారు.

 
ఈ సందర్భంగా వేలాది మంది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, సంఘ్ పరివార్ కార్యకర్తలు పోలీస్ కమిషనర్ కార్యాలయ ముట్టడికి తరలివచ్చారు. దీంతో ఈ మార్గంలో తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొంది. ఉదయం 9 గంటల నుంచి ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు శివాజీనగర బస్టాండు వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని కాషాయం జెండాలను పట్టుకుని రుద్రేశ్ హంతకులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు శవపరీక్షలు నిర్వహించరాదని రుద్రేశ్ కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు పట్టుపట్టడంతో శవపరీక్షలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం అశోక్ మాట్లాడుతూ...హిందూ సంఘాల పట్టుసడలించడానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలను ధ్యేయంగా పెట్టుకుని కొన్ని దుష్టశక్తులు చేస్తున్న దాడులను అరికట్టడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మైసూరులో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్యతో పాటు హిందూ సంఘాల కార్యకర్తలపై నిరంతరం దౌర్జన్యాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.

 

మరిన్ని వార్తలు