గుక్కెడు నీటి కోసం ఎన్ని తిప్పలో..

21 May, 2015 05:35 IST|Sakshi
గుక్కెడు నీటి కోసం ఎన్ని తిప్పలో..

- అడుగంటిన భూగర్భ జలాలు
- రాయచూరు జిల్లాలో
- తీవ్ర తాగునీటి ఎద్దడి
రాయచూరు రూరల్:
ప్రస్తుత వేసవి కాలంలో మండుతున్న ఎండలకు భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో తాగునీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పట్టణంలోని కొళాయిల్లో నీళ్లు రాకపోవడంతో బోర్లలోని ఉప్పు నీటితోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. రాయచూరు పట్టణం లో దాదాపు 4 లక్షలకు పైగా జనాభా వుంది. పట్టణంలో నేతాజీ నగర్, ఎన్‌జీఓ కాలనీ, వాసవీనగర్, పంచముఖీ కాలనీ, మడ్డిపేట, విద్యానగర్, గంజ్‌ఏరియా, షియాతలాబ్, సిటీ టాకీస్ ఏరియా, స్టేషన్ ఏరియా, రామలింగేశ్వర కాలనీ, నీలకంఠేశ్వర నగర్, ఐడీఎంఎస్ లేఅవుట్, నిజలింగప్ప కాలనీ, హరిజనవాడ, బెస్తవారి పేటల్లో నీటి కోసం గంటల తరబడి బోర్ల దగ్గర, కొళాయిల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది. రాత్రి పూట కొన్ని ప్రాంతాల్లో నీటిని విడుదల చేస్తుండటంతో జాగరణ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

పట్టణంలో ఏ కొళాయి వద్ద, బోరింగుల వద్ద చూసినా జనాలు బారులు తీరి కనిపిస్తున్నారు. కొన్ని పథకాల కింద నిర్మించిన ట్యాంకులు నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉన్నందున అవి ప్రజల అవసరాలను ఏమాత్రం తీర్చలేకపోతున్నాయి. వేసవి కాలంలో పట్టణంలోని ప్రజల నీటి అవసరాలను గుర్తించి చేపట్టిన కొత్త పథకం పనులు మందకొడిగా జరుగుతున్నా మరో వైపు వున్న మంచినీటి పథకాల ద్వారా నీటిని అందించడంలో అధికారులు విఫలం అవుతున్నారు. జిల్లాలోని దేవదుర్గ తాలుకా క్యాదిగేర, రంగనాయకి తండా, మల్లాపూర, సింధనూరు తాలుకా శ్రీనివాస్ క్యాంపు, మాన్వి తాలుకా ఇరకల్, కవితాళ, వక్రాణి, చీకలపర్వి క్యాంపుల్లో తాగునీటిని ట్యాంకుల ద్వారా సరఫరా చేపడుతున్నారు. రాయచూరు తాలుకాలో 16, మాన్విలో 33, దేవదుర్గలో 27, సింధనూరులో 52, లింగసూగూరు తాలూకాలో ఐదు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొం దని అధికారులు చెపుతున్నారు. మరోవైపు గుల్బర్గ ప్రాంతీయ కమిషనర్ బిస్వాస్ రాయచూరు మినహా ఏ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి లేదని చెప్పడానికి పైగ్రామాలే సాక్ష్యంగా చెప్పవచ్చు.

రాయచూరు జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు సంబంధించి రూ.1.30 కోట్లు మంజూరైనా ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి నివారణకు జిల్లా అధికార యంత్రాంగం నిధులు కేటాయిం చినా ఫలితం లేకుండా పోతోంది. ఈనేపథ్యంలో పట్టణంలోని ప్రజల అవసరాలను గుర్తించి ఇప్పటికైనా నీటి సరఫరాను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరిన్ని వార్తలు