ఎయిర్‌పోర్టుకు హెలికాప్టర్లో

8 Sep, 2017 08:57 IST|Sakshi
ఎయిర్‌పోర్టుకు హెలికాప్టర్లో

నగరం నుంచి 15 నిమిషాల్లో గమ్యానికి
2 నెలల్లో ‘హెలికాప్టర్‌ ట్యాక్సీ’ అందుబాటులోకి
ఒక ప్రైవేటు సంస్థ పథకం


ఐటీ నగరి బెంగళూరులో ఇప్పటివరకు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాలంటే గంటలకొద్దీ ట్రాఫిక్‌ జాంలలో గడపాల్సిందే. సిటీ నుంచి చెన్నైకి విమానంలో వెళ్లడానికి పట్టే టైం కంటే బెంగళూరు నుంచి విమానాశ్రయానికి చేరుకునే సమయమే ఎక్కువ. దీంతో గంటలకొద్దీ విలువైన సమయం వృథా అవుతోంది. కొంచెం డబ్బు ఖర్చు పెడితే దీనికి మంచి పరిష్కారమే దొరకనుంది. ఇప్పుడు నగరవాసుల కోసం సరికొత్తగా ‘హెలిట్యాక్సీ’ సేవలు అందుబాటులోకి రానున్నాయి. నగరంలోని ట్రాఫిక్‌ పద్మవ్యూహాన్ని తప్పించుకుంటూ నగరం నుంచి పావుగంటలోనే దేవనహళ్లిలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవచ్చు.

సాక్షి, బెంగళూరు:
బెంగళూరులో హెలిట్యాక్సీ సేవలను ఒక ప్రైవేటు ఏవియేషన్‌ సంస్థ అందుబాటులోకి తీసుకురానుంది. హెలిట్యాక్సీ సేవలకు విమానయాన శాఖ అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో హెలిట్యాక్సీ సేవల కోసం నగరంలోని వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్‌ సిటీల్లో హెలిప్యాడ్‌లు నిర్మించేందుకు గాను హెచ్‌ఏఎల్‌ అనుమతులను జారీ చేసింది. ఇక ఈ ప్రాంతాల్లో హెలిప్యాడ్‌లు నిర్మించేందుకు అనువైన ప్రాంతాలను ఏవియేషన్‌ సంస్థ ఎంపిక చేస్తోంది. డిమాండ్‌ను బట్టి నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా హెలిప్యాడ్‌లు నిర్మించనున్నారు.

టికెట్‌.. రూ.2,500– రూ.3,000
నగరంలో ఏ ప్రాంతం నుంచైనా 15 నిమిషాల్లోనే కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ఒక టికెట్‌ ధరను రూ.2,500 – రూ.3,000 మధ్య నిర్ణయించారు. హెలికాప్టర్లను ‘బెల్‌’ సంస్థ నుంచి అద్దెకు తీసుకోనున్నారు. 412–ఐఐ1మోడల్‌ హెలికాప్టర్‌లో 13 మంది, 407 మోడల్‌లో ఐదుగురు ప్రయాణించేందుకు అవకాశం ఉంది.

నగరంలో ప్రస్తుతం 90 వరకు ఆకాశ హరŠామ్యలపై హెలిప్యాడ్‌లు ఉన్నప్పటికీ వీటిలో ఏ ఒకటో, రెండో మాత్రమే అధికారికంగా అనుమతులు పొందాయి. కాగా, నగరంలో హెలిట్యాక్సీ సేవలు అందుబాటులోకి వస్తే మిగిలిన కట్టడాల యజమానులు సైతం తమ హెలిప్యాడ్‌లకు అనుమతులు పొందే అవకాశం ఉంది. ఆ సంస్థ ఎండీ కె.ఎన్‌.జి.నాయర్‌ మాట్లాడుతూ.....‘మరో రెండు నెలల్లో హెలిట్యాక్సీల ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటిస్తాం. మొదటి విడతలో ఎలక్ట్రానిక్‌ సిటీ, వైట్‌ఫీల్డ్‌ ప్రాంతాల్లో హెలిప్యాడ్‌లు నిర్మించనున్నాం.’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు