హాలీవుడ్‌కు దీటుగా బాహుబలి

7 Jun, 2015 03:44 IST|Sakshi

బాహుబలి సినిమా ప్రపంచం అంతా అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రం ఇది. దీనికి సృష్టికర్త రాజమౌళి. టాలీవుడ్‌లో అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని వాడుకుంటూ తన చిత్రాలతో వండర్స్ సృష్టిస్తున్న మేటి దర్శకుడీయన. విక్రమార్కుడు, ఛత్రపతి, మగధీర, ఈగ వంటి సూపర్ సక్సెస్ చిత్రాల తరువాత రాజమౌళి తాజా చిత్రం బాహుబలి. ఇప్పటి వరకు టాలీవుడ్ వరకు పరిమితం అయిన తన ప్రతిభాపాటవాలను రాజమౌళి ఈ చిత్రంతో కోలీవుడ్, బాలీవుడ్‌లకు చాటనున్నారు. బాహుబలి చిత్రాన్ని ఆయన ఈ మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రాణా, అనుష్క, తమన్న, సుధీప్, సత్యరాజ్, నాజర్ వంటి ప్రముఖ తారలు నటిస్తున్నారు.

శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ వెర్షన్ హక్కులను స్టూడియో గ్రీన్ కె ఇ జ్ఞానవేల్ రాజా పొందారు. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు మదన్‌కార్గి మాటలు రాయడం విశేషం. అలాగే చిత్రాన్ని తమిళనాడులో శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థ విడుదల చేయనుంది. ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం ఈ సందర్భంగా చిత్ర హీరో ప్రభాస్ మాట్లాడుతూ ఒకసారి రాజమౌళి కలిసి చిత్రం చేద్దాం అనగానే కథ ఏమిటని కూడా అడగకుండా ఒకే చేద్దాం అన్నానన్నారు. ఎందుకంటే ఆ విషయాలన్నీ ఆయనే చూసుకుంటారన్న నమ్మకంతోనే అన్నారు. బాహుబలి కోసం 300 రోజులు శ్రమించారన్నారు. గుర్రపుస్వారీ, కత్తి యుద్ధా ల్లో శిక్షణ తీసుకున్నానని తెలి పారు. ఇలాంటి చిత్రం భవిష్యత్తులో మళ్లీ చేయడం సాధ్యం కాకపోవచ్చునని ప్రభాస్ పేర్కొన్నారు.

ఇండియన్ సినిమా గర్వపడేలా
బాహుబలిని ఇండియన్ సినిమాగర్వ పడేలా దర్శకుడు రాజమౌళి సిల్వర్ స్కీన్‌పై ఆవిష్కరించారని నటుడు సూర్య పేర్కొన్నారు. ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బాహుబలి చిత్రంలో ప్రతి ఫ్రేమ్ ఆశ్యర్యంతో ముంచెత్తుతుందన్నారు.  బాహుబలిలో చిన్న వేషం అయినా వేయాలని ఆశించానని ఆ అవకాశం లభించకపోయినా ఈ చిత్ర ప్రచారంలో తాను ఒక భాగం అవ్వడం సంతోషంగా ఉందన్నారు. బాహుబలి చిత్ర షూటింగ్ స్పాట్‌కు ఒక్కసారి వెళ్లానని అప్పుడా చిత్రానికి మూడువేలమంది ఏకధాటిగా పని చేయడం చూసి ఆశ్చర్యపోయానని సూర్య అన్నారు. ఇప్పటి వరకు హాలీవుడ్ చిత్రాల తరహాలో చిత్రాలు చేయాలని అనుకుంటున్నామన్నారు.  బాహుబలి చూసిన తరువాత హాలీవుడ్ పరిశ్రమ ఇలాంటి చిత్రం చేయాలని ఆశపడుతుందని సూర్య అన్నారు.
 

మరిన్ని వార్తలు