‘బరోడా’ బాబు.. హెరిటేజ్‌ మురి‘పాలు’

17 Jan, 2017 00:55 IST|Sakshi
‘బరోడా’ బాబు.. హెరిటేజ్‌ మురి‘పాలు’

రుణమాఫీ జరగక రాష్ట్ర రైతాంగం ఆత్మహత్యల బాట

  • రుణాలు లేవు.. రీషెడ్యూలూ జరగలేదు
  • రబీలో రూ.24 వేల కోట్లకు గాను రూ.3,360 కోట్లే ఇచ్చిన బ్యాంకులు
  • భేష్‌ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
  • వరుస కరువులతో అల్లాడుతున్న రైతాంగాన్ని పట్టించుకోని వైనం
  • సొంత సంస్థ హెరిటేజ్‌ ప్రయోజనాలకు పెద్దపీట
  • మాక్స్‌ ముసుగులో చిత్తూరు డెయిరీ సహా అన్ని డెయిరీలు నిర్వీర్యం
  • తాజాగా హెరిటేజ్‌ పాడి రైతుల కోసం బ్యాంకుతో ఒప్పందం
  • హెరిటేజ్‌ ఫుడ్స్‌తో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అవగాహన
  • హెరిటేజ్‌ పాడిరైతులకు రుణాలిస్తామన్న బ్యాంకు

సాక్షి, అమరావతి: రుణమాఫీ కొలిక్కిరాలేదు. ఆ పేరిట జమ చేస్తున్న మొత్తం వడ్డీకి కూడా సరిపోవడం లేదు. కొత్తగా రుణాలు మంజూరు కావడం లేదు. రాష్ట్రంలో అన్నదాత బలవన్మరణాలు ఆగడం లేదు. కనీసం రుణాల రీషెడ్యూల్‌ అయినా జరిగిందా అంటే అదీ లేదు. బ్యాంకులు రబీలో ఇవ్వాల్సిన రుణాలు కేవలం 14 శాతం మాత్రమే ఇచ్చినా పట్టించుకోకపోగా భేష్‌ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. వరుస కరువులతో దిక్కుతోచక రైతాంగం అల్లాడుతున్నా పట్టించుకోకుండా తన సొంత ప్రయోజనాలపైనే దృష్టి కేంద్రీకరించారు. సొంత సంస్థ హెరిటేజ్‌ డెయిరీ రైతులకు రుణాలు ఇప్పించేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో ఒప్పందం కుదుర్చుకోవడంపై పెద్దయెత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రుణమాఫీ పేరిట రైతుల్ని ఆత్మహత్యల బాట పట్టించిన చంద్రబాబు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోయినా పట్టించుకోక పోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పెద్ద నోట్ల రద్దుతో అన్నదాత అన్ని విధాలా కుదేలయ్యాడు. ఖరీఫ్‌లో పండిన ధాన్యాన్ని కొనే దిక్కే లేకుండా పోయింది. బ్యాంకులు అరకొరగా ఇచ్చే రుణాలకు ఎగనామం పెట్టాయి. రబీ సీజన్‌లో రైతులకు మొత్తం రూ.24 వేల కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా.. అందులో బ్యాంకులు 14 శాతం అంటే కేవలం రూ.3,360 కోట్లను మాత్రమే ఇచ్చినట్టు ఎస్‌ఎల్‌బీసీ లెక్కతేలిస్తే.. చంద్రబాబు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. రుణాలు రాక, ఆనవాయితీగా బంగారంపై ఇచ్చే అప్పుల్ని సైతం బ్యాంకులు ఇవ్వకపోవడంతో నూటికి 55 శాతం మంది రైతులు పంటలకు దూరమయ్యారు. ఫలితంగా 24.68 లక్షల హెక్టార్ల రబీ సాగు విస్తీర్ణంలో సగానికి మించి విత్తనాలు పడని దుస్థితి నెలకొంది. ఇప్పటికీ 268 మండలాలు కరవు కోరల్లోనే ఉన్నాయి.

ఇవన్నీ చంద్రబాబును ఏమాత్రం కదిలించ లేదు. కానీ తన సంస్థ ప్రయోజనాల కోసం మొదట్నుంచీ ‘సర్వశక్తులు’ ఒడ్డుతున్న చంద్రబాబు తాజాగా గత నెల 26న బ్యాంకర్లతో స్వయంగా మాట్లాడి హెరిటేజ్‌ డెయిరీ రైతులకు రుణ సదుపాయం కల్పించేలా అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. (ఇటీవల చంద్రబాబు బ్యాంకు అధికారులతో సమావేశం అంటూ ముంబయి వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే) హెరిటేజ్‌ పాడిరైతులకు రుణాలు ఇచ్చేందుకు హెరిటేజ్‌ ఫుడ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మార్కెటింగ్‌ మేనేజర్‌ రాకేష్‌ భాటియా ప్రకటించారు. నష్టాలతో కునారిల్లుతున్న ప్రభుత్వరంగ సంస్థ ఏపీ డెయిరీని మాత్రం విస్మరించారు. పాడి రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం కొత్తేమీ కాకపోయినా ప్రభుత్వ రంగంలో ఉన్న విజయా డెయిరీ కాకుండా తన సొంత సంస్థ హెరిటేజ్‌  డెయిరీకి ముఖ్యమంత్రి ఇలాంటి సౌలభ్యం కల్పించడం గమనార్హం.

చిత్తూరు డెయిరీని మూయించి..
1992లో తాను ముచ్చటపడి నెలకొల్పిన హెరిటేజ్‌ డెయిరీ కోసం తన సొంత జిల్లాలో ప్రఖ్యాతి గాంచిన చిత్తూరు జిల్లా డెయిరీ మూతపడేలా చంద్రబాబు వ్యవహరించా రన్న ఆరోపణలున్నాయి. సహకారోద్యమాన్ని బలోపేతం చేసే పేరిట ఏపీ మ్యూచ్‌ వల్లీ ఎయిడెడ్‌ కో ఆపరేటివ్‌ యాక్ట్‌ (ఏపీ మాక్స్‌– 95 చట్టం)ను తీసుకువచ్చి జిల్లా డెయిరీలను క్రమంగా నిర్వీర్యం చేయించి వాటిని హెరిటేజ్‌కు అనుబంధంగా మలుచు కున్నారు. ఈ క్రమంలోనే  రూ.200 హెరిటేజ్‌ షేర్‌ విలువ రూ.900 దాటిపోయింది. మరోవైపు విజయా బ్రాండును దెబ్బతీశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మొదలు వివిధ సంస్థల్లో హెరిటేజ్‌ పాల ఉత్పత్తుల్నే వాడేలా చర్యలు తీసుకున్నారు.  గతంలో ఆంధ్రప్రదేశ్‌ పాడిపరిశ్రమాభివృద్ధి సమాఖ్యకు బలమైన కేంద్రాలుగా ఉన్న కృష్ణా, గుంటూరు, విశాఖ, నెల్లూరు, ఒంగోలు కేంద్రాలు ఆ తర్వాత మాక్స్‌–1995 కిందికి మారిపోయి నిర్వీర్యమయ్యాయి. మిగిలి ఉన్న ఒకటీ అరా కూడా ప్రస్తుతం సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితికి చేరుకున్నాయి. అందులో కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల యూనియన్‌ ఒకటి.

ఏపీ డెయిరీ రైతుల గోడు పట్టదేం..?
రాష్ట్ర విభజన అనంతరం ఏపీ డెయిరీ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. చెక్‌ పవర్‌ తెలంగాణలో ఉండిపోవడంతో రైతులు తాము పోసిన పాల బకాయిల కోసం రోడ్లెక్కారు. రోజుల తరబడి ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ముఖ్య మంత్రి  విదేశీ యాత్రల కోసం ప్రత్యేక విమానాల్లో పెట్టిన ఖర్చులో మూడో వంతు అంటే రూ.30 కోట్ల కోసం రైతులు రెండు నెలలు ఆందోళన చేయాల్సి వచ్చింది. హిందూపురం మొదలు చల్లపల్లి వరకు అదే తీరు. చివరకు కొన్ని బకాయిలు చెల్లించినా ఇంకొన్ని కోట్ల మేరకు బకాయిలు అలాగే ఉన్నాయి. తెలంగాణ  ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తమ ప్రభుత్వ సంస్థను ప్రోత్సహించేందుకు లీటర్‌కు రూ.4 బోనస్‌ ప్రకటించడం గమనార్హం. కాగా చంద్రబాబు తన చర్యలతో రాష్ట్రంలో పాడి రైతులు హెరిటేజ్‌ వైపు మళ్లక తప్పని పరిస్థితి కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రభుత్వ సంస్థలను లాభాల బాట పట్టిం చేందుకు, తద్వారా ప్రజా సంక్షేమానికి కృషి చేయాల్సింది పోయి తన సంస్థ బాగుంటే చాలనే ధోరణితో వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు