అమ్మానాన్నలూ.. పిల్లలకు ధైర్యం చెప్పండి..

21 Apr, 2019 20:02 IST|Sakshi

ట్విటర్‌లో హీరో కార్తీ పిలుపు..

తెలిసి...తెలియని వయసు... మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు. దీంతో చిన్న విషయానికే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇంటర్మీడియెట్‌ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదని, ఫెయిల్‌ అయ్యామని కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడి కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. ఇదే విషయంపై ప్రముఖ హీరో కార్తీ స్పందించారు. ‘అమ్మానాన్నలూ.. పిల్లలకు ధైర్యం చెప్పండి.. మంచి మార్కులు సాధించడమే జీవితం కాదు’.  అంటూ కార్తీ ఆదివారం ట్వీట్‌ చేశాడు.

గడిచిన రెండు రోజుల నుంచి ఇంటర్మీడియెట్‌ ఫలితాల నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలను పురస్కరించుకొని అతడు ట్విటర్‌లో స్పందించారు. దేశవ్యాప్తంగా వెలువడుతున్న ఇంటర్, ప్లస్‌–2 ఫలితాలతో ఫెయిలైన వారు మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కార్తీని తీవ్రంగా కలిచివేశాయి. తాజాగా టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ మేనల్లుడు ధర్మారామ్‌ 6 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అతడిని కదిలిచింది.

ఈ నేపథ్యంలో తాము కోరుకున్న మార్కులు రాలేదని చాలా మంది విద్యార్ధులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ విషయమై కార్తీ స్పందిస్తూ... ఇలాంటి ఒత్తిడితో కూడుకున్న సమయంలో తల్లిదండ్రులంతా పిల్లలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మంచి మార్కులే జీవితం కాదని వ్యాఖ్యానిస్తూ...పిల్లలకు అండగా ఉండి వారి ఒత్తిడి దూరం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులేనన్నారు. ట్విటర్‌లో కార్తీ స్పందిస్తూ... ప్రియమైన తల్లిదండ్రులకు.. ఇది పిల్లలకు చాలా ఒత్తిడితో కూడుకున్న సమయం.. ఏది ఏమైనా మీరు వారు వెంటనే ఉన్నామని ధైర్యం చెప్పండి.. మంచి మార్కులు సాధించడమే జీవితం కాదని ట్వీట్‌ చేశాడు. దీనికి  #results#12th exam అనే హ్యాగ్‌ట్యాగ్‌లను జత చేశాడు.

మరిన్ని వార్తలు