కేసులు పెట్టండి

6 Jun, 2015 02:01 IST|Sakshi

 సాక్షి, చెన్నై :‘అవినీతి క్యాన్సర్ లాంటిది...అవినీతికి పాల్పడే వాళ్లను వదలి పెట్టొద్దు...కేసులు పెట్టండి ’ అని రవాణా శాఖలో అవకతవకలపై ఏసీబీని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఆదేశించింది. డీఎంకే నేత, మాజీ మంత్రి నెహ్రూ సహా 18 మంది అధికారులపై కేసుల నమోదుకు ఆదేశాలు వెలువడడంతో ఏసీబీ వర్గాలు రంగంలోకి దిగాయి. తిరుచ్చికి చెందిన  ఓ మాజీ అధికారి గోవిందరాజు రవాణా శాఖలో గతంలో జరిగిన అవకతవకలను వెలుగులోకి తెచ్చారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలతో మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంను ఆశ్రయించారు. 2006-2011లో రవాణా శాఖ మంత్రిగా కేఎన్ నెహ్రూ వ్యవహరించారని తన పిటిషన్‌లో వివరించారు. తన హయాంలో బంధువులకు రవాణా శాఖ ద్వారా రాజ భోగం కల్పించారని ఆరోపించారు.
 
  విమాన టికెట్లు, వసతి సౌకార్యాలన్నింటినీ రవాణా శాఖ ద్వారానే సాగించారని, *32.88 లక్షల మేరకు ఖర్చు చేశారని వివరాలను కోర్టుకు దృష్టికి తెచ్చారు. ఇందుకు అధికారులు సైతం అండగా నిలిచారని, ప్రజా సొమ్మును బంధువులకు ధారాదత్తం చేసిన నె హ్రూపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సహకరించిన అధికారుల్ని కఠినంగా శిక్షించాలని, ఈ వ్యవహారానికి సంబంధించి ఏసీబీ సైతం విచారణ జరిపి ఆధారాలను సేకరించి ఉన్నదని వివరించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి ఎస్ నాగముత్తు విచారణ చేపట్టారు. ఏసీబీ నుంచి సేకరించిన వివరాలను నివేదిక రూపంలో తెప్పించుకున్నారు.
 
 కేసులు పెట్టండి : వాదనలు, విచారణ ముగియడంతో శుక్రవారం అవకతవకలకు పాల్పడ్డ వారందరిపై కేసులు పెట్టాలని న్యాయమూర్తి నాగముత్తు ఆదేశాలు జారీ చేశారు. ఈ అవకతవకలకు సంబంధించి ఏసీబీ 62 సాక్షాలను సేకరించిందని. 50 మంది నుంచి వివరాలను రాబట్టారని, అలాంటప్పుడు కేసు నమోదులో జాప్యం ఎందుకు అని ప్రశ్నించారు. అవినీతి అనేది ఈ సమాజాన్ని మింగేస్తుందని, జాప్యం చేయొద్దని కేసులు పెట్టండని ఆదేశించారు. అవినీతి జరిగినట్టు, అవకతవకలకు పాల్పడ్డట్టుగా అన్ని ఆధారాలు ఉన్న దృష్ట్యా, అప్పట్లో మంత్రిగా ఉన్న కేఎన్ నెహ్రూ, రవాణా శాఖ ఉన్నతాధికారి రాజేంద్రన్‌తో పాటుగా 18 మంది అధికారులపై కేసులు నమోదు చేసి, విచారణను వేగవంతం చేయాలని ఏసీబీని ఆదేశించారు.
 
 కేసుల నమోదుకు ఆదేశాలు జారీ కావడంతో అందుకు తగ్గ కసరత్తుల్ని ఏసీబీ వర్గాలు వేగవంతం చేసి ఉన్నాయి. రవాణా శాఖలో ఉన్న అధికారులు ఎక్కడ తమ మెడకు ఈ  ఉచ్చు తగులుకుంటుందోనన్న ఆందోళనలో ఉన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తిరుచ్చి జిల్లాలో బలమైన నేతగా ఉన్న కేఎన్ నెహ్రూను ఈ కేసులో అరెస్టు చేసి కటకటాల్లోకి పంపిన పక్షంలో, డీఎంకేకు గట్టి దెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువే.
 

Read latest State News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు