కలైపులి థానుకు హైకోర్టు నోటీసులు

18 Feb, 2016 08:36 IST|Sakshi

చెన్నై : తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు కలైపులి థానుకు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. స్థానిక కోడంబాక్కం కు చెందిన జే.మదియళగన్, సాలిగ్రామానికి చెందిన ఆర్.మహాలక్ష్మి,పి.ఆర్.కన్నన్ మద్రాసు హైకోర్టులో కోర్టు తీర్పు ధిక్కారపు పిటిషన్ దాఖలు చేశారు. అందులో వారు పేర్కొంటూ దక్షిణ భారత చలన చిత్రం మండలి, బుల్లితెర కళాకారుల సంఘం, అనువాద కళాకారుల అసోషియేషన్‌లలో తాము సభ్యత్వం కలిగి ఉన్నామన్నారు.
 
పలువురు ప్రముఖ నటీనటులకు డబ్బింగ్ చెప్పామని తెలిపారు.అయితే అందుకు పారితోషికాలను ఆయా సంఘాలకు అందిస్తున్నారని, ఆ సంఘ నిర్వాహకులు అందులో 10 శాతం మినహాయించి మిగిలినది తమకు ఇస్తున్నారని వివరించారు. ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ తాము కోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు.కోర్టు తమ పారితోషికాలను నేరుగా తమకే అందించాలనీ,అందులో 10 శాతం సంఘాలు తీసుకోరాదని గత ఏడాది మార్చి 31వ తేదీన తీర్పు ఇచ్చిందన్నారు. అయినా ఆయా సంఘాలు హైకోర్టు తీర్పును ధిక్కరిస్తూ తమ పారితోషికాల్లో 10 శాతం కట్ చేస్తున్నాయని పేర్కొన్నారు.
 
కోర్టు ధిక్కార కేసు కింద వారి సినీ, బుల్లితెర సంఘం కార్యదర్శి ఎంఏ.ప్రకాశ్,అధ్యక్షుడు కేఆర్.సెల్వరాజ్,తమిళ సినీ నిర్మాతల సంఘం అధ్యక్షుడు కలైపులి థానులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కేసు న్యాయమూర్తి టీఎస్.శివజ్ఞానం సమక్షంలో విచారణకు వచ్చింది.కేసు పూర్వాపరాలను పరీక్షించిన న్యాయమూర్తి కలైపులి థాను,కేఆర్.సెల్వరాజ్,ఎంఏ.ప్రకాశ్‌లకు కోర్టు తీర్పు ధిక్కార చట్టం ప్రకారం నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశించారు.

మరిన్ని వార్తలు