ఆలయాన్ని కూల్చేయండి!

18 Dec, 2013 03:25 IST|Sakshi

సాక్షి, చెన్నై:  అందరివాడు, దివంగత ఎంజియార్ ఆరోగ్య క్షేమాన్ని కాంక్షిస్తూ నిర్మించిన ఆలయం మరి కొద్ది రోజుల్లో నేల మట్టం కానుంది. శ్రీనీది కరుమారియమ్మన్  ఆలయా న్ని కూల్చి వేయాల్సిందేనని మంగళవారం మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది.
 రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్మరణీయు డు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీయా ర్. అందరి వాడిగా మన్ననలు అందుకున్న ఎంజియార్‌కు రాష్ట్రంలో అనేక ఆలయాలు ఉన్నాయి. ఆయన విగ్రహం అంటూ లేని ఊరు ఉండదు. ఇందులో మద్రాసు హైకోర్టు ప్రవేశ మార్గంలో ఉన్న శ్రీనీది (న్యాయ) కరుమారియమ్మన్ ఆలయం ఒకటి. ఈ ఆలయ నిర్మాణానికి ఓ కారణం ఉంది. 27 ఏళ్ల క్రితం ఎంజియార్ అనారోగ్యం బారిన పడి అమెరికాలో చికిత్స పొందారు.

ఆయన సంపూర్ణ ఆరోగ్య వంతుడు కావాలని కాంక్షిస్తూ ఈ ఆలయాన్ని అభిమానులు అప్పట్లో నిర్మించా రు. న్యాయ స్థానం ప్రవేశ మార్గంలో శ్రీ నీది కరుమారియమ్మన్ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. 27 ఏళ్లుగా ఇక్కడ అమ్మవారికి పూజలు చేస్తూ వస్తున్నారు. వివిధ వేషాల్లో దివంగత నేత ఎంజియార్ చిత్ర పటాలను కొలువు దీర్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయానికి ట్రస్టీగా కంద శ్రీనివాసన్ వ్యవహరిస్తున్నారు. ఈ ఆలయం హైకోర్టు ప్రవేశ మార్గంలోని ఎన్‌ఎస్‌సీ బోర్డు రోడ్డుపై ఉండటం, ఆ రోడ్డు విస్తరణ కావడం, ఫుట్ పాత్‌లు ఏర్పడటంతో ఈ ఆలయానికి చిక్కులు ఎదురయ్యాయి.

 పిటిషన్: రాకపోకలు అడ్డంకిగా ఉన్న ఈ ఆలయాన్ని తొలగించాలంటూ ఇటీవల సంఘ సేవకుడు ట్రాఫిక్ రామస్వామి హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ఈ ఆలయాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. అయితే, అధికారులు అందుకు తగ్గ చర్యల్ని వేగవంతం చేయలేదు. అదే సమయంలో ఆలయాన్ని కూల్చి వేయకుండా స్టే కోరుతూ కంద శ్రీనివాసన్ హైకోర్టును ఆశ్రయించాడు. అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మళ్లీ ట్రాఫిక్ రామస్వామి కోర్టుకు ఎక్కారు.

 కూల్చండి: న్యాయమూర్తులు సతీష్‌కుమార్ అగ్ని హోత్రి, కేకే శశిధరన్ నేతృత్వంలోని బెంచ్ ఆ పిటిషన్లను విచారిస్తూ వచ్చింది. మంగళవారం వాదనల అనంతరం ఆ ఆలయాన్ని కూల్చి వేయాల్సిందేనని బెంచ్ స్పష్టం చేసింది. ఈ ఆలయం ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మితమైందని న్యాయమూర్తులు పేర్కొన్నారు.  ప్రస్తుతం ఆలయం ఉన్న ఈ స్థలం ప్రైవేటు స్థలం కూడా కాదన్న విషయాన్ని గుర్తించాలని పిటిషనర్‌కు సూచించింది. ప్రైవేటు స్థలంలో నిర్మించుకోవాలేగానీ, ఇలా ప్రభుత్వ స్థలంలో కాదంటూ అక్షింతలు వేసింది. చెన్నై కార్పొరేషన్, దేవాదాయ శాఖ అధికారుల వివరణలు సైతం బెంచ్ పరిగణనలోకి తీసుకుందని వివరించారు. ఫుట్‌పాత్‌ను, కోర్టు ప్రవేశ మార్గాన్ని ఆక్రమిస్తూ నిర్మించిన ఈ ఆలయాన్ని పదిహేను రోజుల్లోపు కూల్చి వేయాల్సిందేనని కార్పొరేషన్ అధికారుల్ని బెంచ్ ఆదేశించింది. స్టే కోసం కందా శ్రీనివాసన్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది.

మరిన్ని వార్తలు