హైటెక్ రెస్టారెంట్లు

4 May, 2015 02:01 IST|Sakshi
హైటెక్ రెస్టారెంట్లు

వినియోగదారులకు ఏం కావాలో ఆర్డర్ తీసుకోవడం, వాళ్లు అడిగింది వడ్డించి బిల్ తీసుకుని పంపేయడం... ఇది నిన్న మొన్నటి వరకు రెస్టారెంట్‌ల విధానం. అయితే ప్రస్తుతం ఆ విధానంలో మార్పు వస్తోంది. రెస్టారెంట్‌కి వచ్చే వినియోగదారులకు కావాల్సిన భోజనాన్ని అందించడంలో కాస్తంత వైవిధ్యాన్ని కనబరుస్తున్నారు. అందులో భాగంగానే రెస్టారెంట్‌లకు సరికొత్త హంగులను, హై‘టెక్’ సొబగులను అద్దుతున్నారు. టేబుల్ పై నుండే ఆర్డర్ ఇచ్చేలా అందుబాటులోకి వచ్చిన ‘ఈ-మెను’, టేబుల్ పైనే ఉండే ‘పొయ్యి’ ఇవన్నీ ఈ తరహాలోనివే. ఇంకేముంది రెస్టారెంట్‌లలోని మెనూతో పాటు ఈ నయా హంగులను నగరవాసులు ఆస్వాదించేస్తున్నారు.
 - సాక్షి, బెంగళూరు
 
 టేబుల్ పైనే ‘ఈ-మెను’

స్నేహితుడి పుట్టిన రోజు వేడుకనో, లేదంటే వివాహ వార్షికోత్సవమనో, అదీ కాకపోతే సరదాగా వీకెండ్ సమయాల్లోనో ఇలా ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో కుటుంబంతో కలిసి లేదంటే స్నేహితులతోనో రెస్టారెంట్‌లకు వెళ్లడం నగరంలో సర్వసాధారణం. అయితే అక్కడ మెనూను అందించేటపుడు సర్వర్‌లు చేసే ఆలస్యంతో సంతోషం కాస్తా నీరుగారిపోతుంది. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టే ఉద్దేశంతోనే నగరంలో ప్రస్తుతం ‘ఈ-మెను’ను అందించే రెస్టారెంట్‌లు ప్రారంభమవుతున్నాయి. రెస్టారెంట్‌కు వచ్చిన వినియోగదారులు సర్వర్ తమ టేబుల్ దగ్గరికి ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూసే అవసరం లేకుండా చేస్తుంది ఈ ‘ఈ-మెను’.  రెస్టారెంట్‌లోని ప్రతి డైనింగ్ టేబుల్ పై ఎల్‌సీడీ టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇందులో రెస్టారెంట్‌లో అందుబాటులో ఉన్న మెనూ వివరాలతో పాటు కొన్ని గేమ్స్ కూడా పొందుపరచబడి ఉంటాయి. రెస్టారెంట్‌కు వచ్చిన వినియోగదారులు సర్వర్‌ల కోసం ఎదురుచూడకుండా ‘ఈ-మెను’ పద్దతిలో టేబుల్‌పైనే ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ టచ్‌స్క్రీన్ ద్వారానే ఆర్డర్ ఇవ్వవచ్చు. అలా  టేబుల్ నుండి ఆర్డర్ ఇవ్వగానే కిచెన్‌లో ఏర్పాటుచేసిన స్పీకర్‌ల ద్వారా సర్వర్‌లకు తెలిసిపోతుంది. ఇక మీరు ఆర్డర్ చేసిన భోజనం వచ్చే వరకు టైంపాస్ చేయడానికి మీ టేబుల్‌పైనే ఉండే టచ్ స్క్రీన్‌లో గేమ్స్ ఉండనే ఉన్నాయి. వినియోగదారుల టైంని సేవ్ చేయడంతో పాటు వాళ్లకి వినోదాన్ని కూడా పంచే ఈ విధానం నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తోందని ‘ఈ-మెను’ను నగరంలో మొట్టమొదటి సారిగా అందుబాటులోకి తెచ్చిన ‘పేజ్-1’ రెస్టారెంట్ మేనేజింగ్ డెరైక్టర్ వసంత్ చెప్పారు.  

టేబుల్ పైనే ‘వండి’ వడ్డిస్తారు

కొంత కాలం వరకు  సాధారణంగా రెస్టారెంట్‌లో మనం ఆర్డర్ ఇచ్చిన వంటకాలను కిచెన్‌లో వండి తీసుకొచ్చి వడ్డించేవారు. కానీ ప్రస్తుతం ఆ పద్ధతీ మారిపోయింది. నగరంలోని వివిధ రెస్టారెంట్‌లలో మనం ఆర్డర్ చేసిన స్టాటర్స్‌ను (భోజనానికి ముందు తీసుకొనే కొన్ని ఆహారపదార్ధాలు) మన టేబుల్‌పైనే వండి వడ్డించేస్తున్నారు. దీనినే ముద్దుగా ‘బార్బెక్యూ’ విధానంగా పిలుచుకుంటున్నారు. గ్రిల్డ్ విధానంలో తయారయ్యే స్టాటర్స్‌ను టేబుల్‌పైనే సిద్ధం చేసి వేడివేడిగా వడ్డించడమే ‘బార్బెక్యూ’ విధానం. ఇక ఇందులో డైనింగ్ టేబుల్ మధ్య భాగంలో ఒక పాత్రను ఉంచుతారు. అందులో నిప్పులను వేస్తారు. మనం ఆర్డర్ చేసిన స్టాటర్ రకాన్ని(చికెన్,మటన్, పనీర్ ఇలా ఏదైనా) పొడవాటి కడ్డీలకు గుచ్చి ఆ పాత్రపై ఉంచుతారు. కొద్ది నిమిషాల తర్వాత ఆ కడ్డీలకు గుచ్చిన ముక్కలను వేడివేడిగా ప్లేట్‌లో వడ్డించేస్తారు. వినియోగదారుల కళ్లముందే స్టాటర్స్ రెడీ అయిపోవడం, పొగలుకక్కుతూ ప్లేట్‌లోకి చేరిపోతుండడంతో ‘బార్బెక్యూ’ పద్ధతిని అందించే రెస్టారెంట్‌లపైన కూడా నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు.  

ప్రత్యేక థీమ్‌లతో దుమ్ములేపుతున్నారు

వినియోగదారులను ఆకర్షించడానికి రెస్టారెంట్‌లు అనుసరిస్తున్న మరో సరికొత్త విధానం ‘థీమ్’. అవును రెస్టారెంట్ లోపలికి అడుగుపెట్టగానే వినియోగదారులు ఓ ప్రత్యేకమైన అనుభూతికి లోనయ్యేలా చేయడానికి రెస్టారెంట్‌లు ఈ విధానాన్ని ఎంచుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఒక వారం తమ రెస్టారెంట్‌ను అచ్చమైన పల్లెటూరిని తలపించేలా అలంకరిస్తే, మరో వారం ఆది మానవుల కాలం నాటి పరిస్థితులను తెలియజెప్పేలా, ఇంకోవారం దట్టమైన అడవిలా ఇలా విభిన్నంగా, వినూత్నంగా అలంకరించేస్తున్నారు. అంతేకాదండోయ్ రెస్టారెంట్‌లలోని సర్వర్‌లు కూడా థీమ్‌కు తగ్గట్టుగానే తమ డ్రస్‌కోడ్‌ని మార్చేసుకుంటున్నారు. అడవి థీమ్ అయితే గిరిజనుల్లా డ్రెస్ చేసుకోవడం, పల్లె థీమ్ అయితే పంచెకట్టులో ప్రత్యక్షం అవడం చేస్తూ వినియోగదారులను ఆకర్షించేస్తున్నారు.

ఇలా ఎందుకు అంటే రెస్టారెంట్‌కు వచ్చే వినియోగదారులు ప్రస్తుతం టేస్టీ భోజనంతో పాటు మరికొంత ఆహ్లాదాన్ని కూడా కోరుకుంటున్నారని, అందుకే తాము ఈ పద్దతిని ఎంచుకుంటున్నామని చెబుతున్నారు రెస్టారెంట్‌ల నిర్వాహకులు. అంతేకాదు ఈ థీమ్‌ల ద్వారా ప్రస్తుత తరాలకు తెలియకుండా పోతున్న అనేక విషయాలను తెలియజెప్పడమే తమ లక్ష్యమని కూడా చెబుతున్నారు. అందుకే పల్లె సంస్కృతిని తెలియజెప్పేలా, పచ్చదనం ఆవశ్యతను తెలియజెప్పేలా వివిధ థీమ్స్‌ను పరిచయం చేస్తున్నామని చెబుతున్నారు.
 

మరిన్ని వార్తలు